స్త్రీ శక్తి పథకం ప్రారంభమైన ఏడాదిలో ఇప్పటివరకు 87 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని, రోజుకు సుమారు 24 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
గత ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం ఏడాది పూర్తయిన సందర్భంగా 'స్త్రీ శక్తికి సంవత్సరం... రెట్టింపైన ఆత్మవిశ్వాసం' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు అమరావతిలో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. పేరేడు గ్రౌండ్స్ నుంచి క్యాంప్ కార్యాలయం వరకు బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించి, తేనీటి విందు ఇచ్చారు.
స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు తమ డబ్బును కుటుంబ అవసరాలకు, వ్యాపారాలకు వినియోగించుకునే అవకాశం లభించిందని సీఎం పేర్కొన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన చేనేత మహిళతో మాట్లాడుతూ, పథకం ద్వారా నెలకు రూ.1,500 వరకు ఆదా అవుతోందని, చేనేత ఉత్పత్తుల విక్రయానికి ఈ మొత్తాన్ని వినియోగిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఆరోగ్యం బాగుంటే మందుల ఖర్చు కూడా తగ్గుతుందని, ఆరోగ్య అలవాట్లు మార్చుకోవాలని మహిళలకు సీఎం సూచించారు. కడప జిల్లాకు చెందిన ఒక మహిళ స్వయం సహాయక బృందం ద్వారా రూ.కోటి పెట్టుబడితో వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం, సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని చంద్రబాబు అన్నారు.
