రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరస్పర సహకారం, సమన్వయంతో పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు కలసికట్టుగా ముందుకు సాగితే భారతదేశ అభివృద్ధికి మరింత బలమైన చోదకశక్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
- రాష్ట్రాల మధ్య సహకారంతోనే వికసిత్ భారత్ లక్ష్యం
- 2047 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దక్షిణాది రాష్ట్రాలు
- ఏపీ పునర్విభజన చట్టంలో అపరిష్కృత అంశాలపై తక్షణ నిర్ణయం కోరిన సీఎం
- గోదావరి–కావేరి అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా వరద జలాల సద్వినియోగం ప్రతిపాదన
- కుప్పం మీదుగా బుల్లెట్ రైలు కారిడార్ ప్రతిపాదన
తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. 24 అంశాలతో కూడిన ఎజెండాపై సమావేశంలో చర్చించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్ రైలు కారిడార్‌ను అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు — అమరావతి–బెంగళూరు–చెన్నై నగరాలను అనుసంధానించే ఈ మార్గం మూడు రాష్ట్రాల మధ్య ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతం ఇస్తుందని వివరించారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్, డ్రై పోర్టుల ఏర్పాటు, దక్షిణ గ్రిడ్‌ను జాతీయ విద్యుత్ గ్రిడ్‌తో అనుసంధానం చేయడం, సంయుక్త నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకృతి విపత్తుల సమయంలో పరస్పర సహాయానికి ప్రత్యేక విపత్తు నిర్వహణ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు. తిరుపతి, శ్రీశైలం, కాంచీపురం, మధురై, రామేశ్వరం, మైసూరు వంటి పుణ్యక్షేత్రాలను వారణాసి, అయోధ్య, చార్ ధామ్ ప్రాంతాలతో అనుసంధానిస్తూ తీర్థయాత్ర సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు.
దేశ స్థూల ఉత్పత్తిలో దక్షిణాది ఐదు రాష్ట్రాల వాటా ప్రస్తుతం 31 శాతంగా ఉందని, 2047 నాటికి భారత్ 30–35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యానికి దక్షిణాది రాష్ట్రాలు ప్రధాన భూమిక పోషిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ 2.4 ట్రిలియన్, తమిళనాడు 2.6 ట్రిలియన్, కర్ణాటక 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలుగా లక్ష్యాలు నిర్దేశించుకున్నాయని, సమష్టిగా దక్షిణ భారతదేశం 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలను కూడా చంద్రబాబు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు గడిచినా షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన పూర్తికాలేదని, ఆస్తులు, అప్పులు, సంస్థల విషయంలో సమన్యాయం జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 66, సెక్షన్ 56లోని అంశాలపై కేంద్ర నిర్ణయం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని అన్నారు. అయితే హామీ ఇచ్చిన 11 జాతీయ సంస్థల్లో 10 ఇప్పటికే ఏర్పాటు కావడం సంతోషదాయకమని, పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి నిర్మాణంలో కేంద్ర సహకారం కీలకమని కృతజ్ఞతలు తెలిపారు.
భవిష్యత్ నీటి భద్రతకు నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా పోలవరం, కృష్ణా, పెన్నా మీదుగా 500 టీఎంసీలకు పైగా మిగులు వరద జలాలను కావేరి బేసిన్‌కు తరలించే ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచారు — ఇది ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగిస్తుందని అన్నారు. గంగా–కావేరి అనుసంధానాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని, దక్షిణాది నదీ బేసిన్ల సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు.
ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేరళ సీఎం వి.డి. సతీషన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె.కైలాష్ నాథన్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి సహా ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ప్రశంసించారు.
