వైద్యారోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన ‘సంజీవని ప్రాజెక్టు’ను జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించవచ్చని పేర్కొన్నారు.
అమరావతి, ఆగస్ట్ 26: క్యాంపు కార్యాలయంలో బుధవారం ‘సంజీవని ప్రాజెక్ట్’పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. వైద్య సేవల్లో ఏపీని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా ప్రాజెక్టును విజయవంతం చేయాలని సూచించిన సీఎం, కుప్పం నియోజకవర్గం, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే ప్రాజెక్ట్ అమలుతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, వీటిని రాష్ట్రమంతటా విస్తరించేలా చూడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబం విద్యకు, వైద్యానికే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని, ఈ వ్యయాన్ని తగ్గించేందుకే సంజీవని వంటి కార్యక్రమాలను తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్యారోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని ఆయన నిర్దేశించారు.
సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బేస్‌లైన్ అధ్యయనం, డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటు, శిక్షణ, సర్టిఫికేషన్, జాతీయ-రాష్ట్ర పోర్టల్స్‌తో ఇంటిగ్రేషన్ వంటి చర్యలు ఈ ప్రణాళికలో ఉన్నాయని, 28 జిల్లాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు.
డేటా గోప్యత, భద్రతకు ప్రాధాన్యం
సమీక్షలో సీఎం మాట్లాడుతూ, ప్రిడెక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్‌గా వైద్యసేవలు అందించాలని, వైద్య సేవలతో పాటు ఆహారపు అలవాట్లు, ఆలోచనా విధానం మారేలా చూడాలని సూచించారు. హోమియోపతి, ఆయుర్వేద, యోగా, ప్రాణాయామంతో పాటు అత్యాధునిక వైద్య విజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, ఏఐ డాక్టర్‌ను కూడా విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. డేటాను భద్రపరచడం, గోప్యంగా ఉంచడంతో పాటు డ్యాష్‌బోర్డు సిద్ధం చేయాలని, ఆస్పత్రుల్లో శానిటేషన్సహా వివిధ ఔట్సోర్సింగ్ సేవల విషయంలో దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమర్థవంతంగా సేవలు అందించని ఔట్సోర్సింగ్ సర్వీస్ ప్రొవైడర్లను తొలగించేలా ఒక విధానం తీసుకురావాలని, ప్రజల మొబైళ్లకు నేరుగా హెల్త్ అప్డేట్స్ పంపించేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు.
వ్యాధుల నియంత్రణకు దోహదం
కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో సంజీవని కార్యక్రమం అమలుతో వచ్చిన ఫలితాలను సమీక్షలో ముఖ్యమంత్రి పరిశీలించారు. చిత్తూరులో నమోదైన ఫలితాల ప్రకారం హైపర్‌టెన్షన్ కేసుల్లో 56 శాతం నియంత్రణలోకి వచ్చాయని, డయాబెటిస్ కేసుల్లో 16 శాతం తీవ్రత తగ్గిందని అధికారులు వివరించారు. ప్రైమరీ హెల్త్‌కేర్ సేవల వినియోగంలోనూ గణనీయమైన పెరుగుదల నమోదైనట్టు తెలిపారు. సంజీవని సేవలపై నిర్వహించిన సర్వేలో 91 శాతం మంది పౌరులు, సేవల అనంతరం తమ ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని చెప్పినట్టు వెల్లడించారు. స్క్రీనింగ్ నుంచి చికిత్స, ఫాలోఅప్ వరకు ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ, టాటా ఎండీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
