మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైద్యం కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా వైద్యమే వారి దగ్గరకు రావాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.
అరకు, ఆగస్టు 29: అరకు లోయ నియోజకవర్గం గన్నెలలో సంజీవని ప్రాజెక్టు అమలు తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్ద మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికీ నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని, వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డులను రూపొందించేలా చేపట్టిన సంజీవని ద్వారా ప్రతీ ఒక్కరి ఆరోగ్యాన్ని సంరక్షిస్తామని వివరించారు. ఈ ప్రాజెక్టును త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, అదే నిజమైన అభివృద్ధి అని చంద్రబాబు అన్నారు.
గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం రూ.250 కోట్లతో ట్రైబల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీషన్ మిషన్ తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సికిల్‌సెల్, తలసేమియా బాధితులకు నెలకు రూ.10 వేల పెన్షన్ అందిస్తున్నామని, త్వరలో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో తక్కువ ధరకే మందులు అందించే జన ఔషధి కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పారు. అల్లూరి జిల్లాలో సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, గతంలోనే అల్లూరి సీతారామరాజు గిరిజనులకు ఆయుర్వేద వైద్యాన్ని అందించారని గుర్తుచేస్తూ, ఆ మహనీయుడిని నిత్యం స్మరించుకునేందుకు కొత్తగా నిర్మించిన ఎయిర్‌పోర్టుకు ఆయన పేరు పెట్టామని తెలిపారు. థింసా నృత్యంతో గిరిజన బిడ్డలు గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించడం అభినందనీయమని పేర్కొన్న సీఎం, యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచేందుకు సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
డ్రోన్లతో అత్యవసర ఔషధాలు, వ్యాక్సీన్ల తరలింపు
ఏజెన్సీ ప్రాంతాల నుంచి రోగుల రక్త నమూనాలను డ్రోన్ల ద్వారా పెద్ద ఆసుపత్రులకు తరలించి పరీక్షలు నిర్వహించి చికిత్స అందించేలా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా గర్భిణులకు సేవలందిస్తున్నామని, 104 వాహనాల ద్వారా సంచార వైద్య సేవలు అందిస్తున్నామని, ఇంటి వద్దే 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గం, చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ గేమ్ చేంజర్‌గా మారుతుందని అన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం అల్లూరి జిల్లాలో 150 వాహనాలతో ఎమర్జెన్సీ లైఫ్‌లైన్ నెట్వర్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గిరిజనాభివృద్ధికి ఐదు సూత్రాలు
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐదు సూత్రాలతో ప్రణాళికలు రూపొందించామని చంద్రబాబు తెలిపారు. ‘అడవి తల్లి బాట’ పేరుతో రూ.1,000 కోట్లతో 905 కిలోమీటర్ల రహదారులు నిర్మించామని, 1.60 లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా నీరు అందించడంతో పాటు సోలార్ రూఫ్‌టాప్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉపాధి పెంచేందుకు అరకు కాఫీని మరో లక్ష ఎకరాల్లో సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నామని, హోమ్‌స్టేల ద్వారా ఆతిథ్యం అందిస్తే గిరిజన కుటుంబాలకు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. పరిశ్రమల్లో గిరిజన యువతకు ఉద్యోగాలు దక్కేలా నైపుణ్యాభివృద్ధి కల్పిస్తామని, వచ్చే మూడేళ్లలో లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కేలా జీఓ నంబర్ 3ను తమ ప్రభుత్వమే తీసుకొచ్చిందని, గత పాలకుల నిర్లక్ష్యంతో సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసిందని ఆరోపించిన సీఎం, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయాన్ని త్వరలో తీసుకొస్తామని తెలిపారు. గిరిజన బిడ్డలు దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో చదవాలన్న ఉద్దేశంతో ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం చేసుకున్నామని, ఐఐటీ, నీట్ వంటి పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందిస్తున్నామని చెప్పారు. 2014లో విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసిన మెడ్‌టెక్ జోన్ ఇప్పుడు ప్రపంచ స్థాయి వైద్య పరికరాలను తయారు చేస్తోందని, ఆ ఉత్పత్తులు అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్టు ద్వారా ప్రపంచానికి ఎగుమతి అవుతాయని తెలిపారు. సెప్టెంబర్ 2న పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి నీటిని అనకాపల్లికి తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
గత పాలకులపై విమర్శలు
గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారని చంద్రబాబు విమర్శించారు. జే బ్రాండ్లు, కల్తీ మద్యం ద్వారా వేలాది మంది ఆరోగ్యాన్ని నాశనం చేశారని ఆరోపిస్తూ, జే బ్రాండ్లను రద్దు చేసి మద్యం విధానాన్ని ప్రక్షాళన చేశామని చెప్పారు. గంజాయి ద్వారా ఏజెన్సీ ప్రాంతానికి గత పాలకులు చెడ్డపేరు తెచ్చారని విమర్శిస్తూ, ఇప్పుడు కాఫీ, మిరియాలు వంటి ప్రత్యామ్నాయ పంటలతో గిరిజనులకు ఆదాయ మార్గాలు చూపుతున్నామని తెలిపారు. గ్రూప్-1 పరీక్షల్లో గత పాలకులు అవకతవకలకు పాల్పడ్డారని, ఆర్డీఓ స్థాయి అధికారులను ఎంపిక చేసే పరీక్షా పత్రాలను ఎలక్ట్రీషియన్, అటెండర్ చేత దిద్దించారని ఆరోపించారు.
గత పాలనలో దేవాలయాల ప్రతిష్ఠను దెబ్బతీశారని, బలవంతపు మత మార్పిడులు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఓ మాజీ మంత్రి కోడలు బయటకు వచ్చి ఇంట్లో జరిగిన ఘటనలను వెల్లడించారని, బలవంతంగా మతం మార్చే ప్రయత్నం చేశారని ఆమె చెప్పినట్లు తెలిపారు. మత విశ్వాసాలను ఎవరూ తప్పుపట్టరని, కానీ బలవంతంగా మత మార్పిడి చేయడం సరికాదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపైనా పూటకో మాట ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని, గతంలో ఏకగ్రీవమని ఇప్పుడు ఎక్కడా కాకూడదనటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే డీఎస్సీ ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాలు ఇచ్చామని, తొలి సంతకంతో 16 వేల ఉద్యోగాలు ఇస్తే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, గుమ్మిడి సంధ్యారాణితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
