ఏఐ అసిస్టెంట్, డిజి వెరిఫై, డేటా లేక్, బ్లాక్‌చెయిన్ వంటి సాంకేతికతను వినియోగించుకుని ఆన్లైన్ సేవలు మరింత సులభతరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి, ఆగస్ట్ 24: సచివాలయంలో సోమవారం జరిగిన ఆర్టీజీఎస్ సమీక్షలో వివిధ శాఖల పనితీరు, పురోగతి గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వాట్సప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1,204 సేవలకు సంబంధించి డేటా ఎంట్రీ సమాచారాన్ని మరింత సంక్షిప్తం చేయాలని, సర్టిఫికేట్లు అప్లోడ్ చేసే పని లేకుండా డేటా ఇంటిగ్రేషన్ జరగాలని సీఎం స్పష్టం చేశారు. అన్ని శాఖలు మరింత సమర్ధత పెంచుకోవాలని, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అన్నారు.
క్రాప్ అలర్ట్‌లపై పర్యవేక్షణ
ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈసారి వ్యవసాయ దిగుబడులు సాధారణం కన్నా 20 శాతం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించగలమని అధికారులు వెల్లడించగా, ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు సమృద్ధిగా నీరందించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే సాగు మొదలు పెట్టని చోట వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించాలని నిర్దేశించారు.
రైతులకు ఎప్పటికప్పుడు క్రాప్ అలర్ట్ పంపడంతో పాటు దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అధికారులు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ఇందుకోసం ఏపీటీఎస్ అనలిటిక్స్‌ను కూడా వినియోగించుకుని అవేర్‌తో సమన్వయం చేసుకోవాలని ఆయన అన్నారు. తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా చెప్పారు.
డెంగీ, మలేరియా హాట్స్పాట్ల గుర్తింపు
మలేరియా, డెంగీ కేసుల నివారణకు హాట్స్పాట్లు గుర్తించి, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. గత ఏడాది ఇదే సమయానికి 1,361 డెంగీ కేసులు నమోదైతే, ఈ ఏడాది ఇప్పటివరకు 401 కేసులు మాత్రమే నమోదైనట్టు అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కార్బన్ న్యూట్రల్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రెన్యువబుల్ ఎనర్జీపై ఎక్కువ దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. సోలార్ రూఫ్‌టాప్‌లు పెద్దఎత్తున ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టాలని ఆయన నిర్దేశించారు.
