సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే మూల మంత్రాలుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతి వారమూ ప్రజల మధ్యలోనే ఉంటున్నానని, రాష్ట్ర సచివాలయానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చేలా చేయటమే అసలైన సుపరిపాలన అని అన్నారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పండువారిపేటలో నిర్వహించిన 'మీ భూమి- మీ హక్కు' గ్రామసభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
ప్రతి నెలా 9వ తేదీన 'మీ భూమి- మీ హక్కు' కార్యక్రమానికి హాజరై రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని, గత పాలకులు రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి వ్యవస్థను ధ్వంసం చేశారని ఆక్షేపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తెచ్చి ప్రజల భూముల్ని కాజేసే ప్రయత్నం చేశారని, అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసినట్టు తెలిపారు.
- ఈ-కేవైసీ, క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ భద్రతా ఫీచర్లతో పట్టాదారు పాస్ పుస్తకాల జారీ
- ఇప్పటివరకు 8,234 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 36 లక్షల రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ
- వచ్చే మార్చి నాటికి 8,582 గ్రామాల్లో 56 లక్షల పాస్ పుస్తకాలు అందించాలని లక్ష్యం
- వారసత్వ భూముల విభజనలో స్టాంప్ డ్యూటీని రూ.1,000కే పరిమితం — 1.25 లక్షల కుటుంబాలకు ప్రయోజనం
- తప్పులు సరిచేసి 16 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగింపు
- శెట్టిపల్లి, కంగుంది, వట్టిచెరుకూరు, ముదినేపల్లి తదితర చోట్ల దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న 244 కీలక భూ సమస్యలకు పరిష్కారం
- అమలాపురంలోని మాచవరం, ముమ్మిడివరం, రామచంద్రాపురంలో 1908 నుంచి 22ఏ1 కింద నిషేధంలో ఉన్న భూముల సమస్యనూ పరిష్కరిస్తున్నట్టు వెల్లడి — 56.37 ఎకరాలను 1,410 మందికి లబ్ధి చేకూర్చేలా చర్యలు
నీటి భద్రత, భూమి భద్రతపై ప్రాధాన్యం
రాష్ట్రంలో తీవ్రమైన ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ గోదావరి నుంచి ఈ ఏడాది వెయ్యి టీఎంసీలకు పైగా నీరు సముద్రంలోకి వెళ్లిందని, ఆ నీటిని వినియోగించుకుంటే రాష్ట్రానికి ప్రయోజనం కలిగేదని సీఎం అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందని, రాజకీయ కక్షతో కాంట్రాక్టర్ను మార్చడంతో ప్రాజెక్టు ఆలస్యమైందని చెప్పారు. 2024లో ప్రజలు ఇచ్చిన మద్దతు ఢిల్లీలోనూ సంజీవనిగా పనిచేసి రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చుకోగలుగుతున్నామని తెలిపారు.
ఈపీడీసీఎల్ గ్రిడ్ ఆధునీకరణకు శంకుస్థాపన
తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) రూ.240 కోట్ల వ్యయంతో చేపట్టిన 3-ఫేజ్ కరెంటు అందించే గ్రిడ్ ఆధునీకరణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, వాసంశెట్టి సుభాష్, ఎంపీ గంటి హరీష్, స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
