ప్రజల మధ్యే పాలన సాగిస్తూ ప్రతి నెలా వివిధ ప్రజా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా భూ హక్కులకు భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'మీ భూమి–మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా పి. గన్నవరం నియోజకవర్గంలో జరిగే గ్రామసభలో పాల్గొని పట్టాదారు పాస్‌పుస్తకాలను సీఎం పంపిణీ చేయనున్నారు. పర్యటనలో భాగంగా రైతులతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు, గ్రామసభలో పాల్గొని భూ హక్కుల పరిరక్షణ, రెవెన్యూ సంస్కరణలపై ప్రజలకు వివరించనున్నారు. అనంతరం బుడుంగపేటలో నిర్వహించే కేడర్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
పాలన అంటే సచివాలయంలో కూర్చోవడం మాత్రమే కాదని, ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే నిజమైన పాలన అనే విధానంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెలా ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన 'పేదల సేవలో', మూడో శనివారం 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర', నాలుగో శనివారం 'సంజీవని', ప్రతి నెలా 9వ తేదీన 'మీ భూమి–మీ హక్కు' కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు.
ఉదయం 9.45 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి కోనసీమ జిల్లా పర్యటనకు బయలుదేరే ముఖ్యమంత్రి, 10.30 గంటలకు అంబాజీపేట మండలం ఇరుసుమండ చేరుకుని ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాచవరం గ్రామంలోని జయంతి నగర్‌కు వెళ్లి, 10.55 నుంచి 11.35 గంటల వరకు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యవసాయం, సాగునీరు, భూ హక్కులు, భూ రికార్డులు తదితర అంశాలపై రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుంటారు. అనంతరం పండువారిపేట గ్రామంలో జరిగే గ్రామసభలో ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 1.55 గంటల వరకు 'మీ భూమి–మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొని అర్హులైన రైతులు, లబ్ధిదారులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 3.15 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు బుడుంగపేటలో కేడర్ సమావేశంలో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు.
'మీ భూమి–మీ హక్కు' కార్యక్రమాన్ని ప్రభుత్వం కేవలం పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంగా చూడటం లేదు. రైతు గౌరవాన్ని, ప్రతి పౌరుడి ఆస్తి హక్కును కాపాడే ప్రజా ఉద్యమంగా అమలు చేస్తోంది. గత ప్రభుత్వంలో రీ-సర్వే ప్రక్రియలో తలెత్తిన సమస్యలను పరిష్కరించి, భూ రికార్డులను సరిచేసి, ప్రతి భూ యజమానికి స్పష్టమైన హక్కును కల్పించేందుకు ప్రభుత్వం రీ-సర్వే 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 8,234 గ్రామాల్లో 36 లక్షలకు పైగా పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ చేపట్టగా, ఈ నెలలో మరో 783 గ్రామాల్లో దాదాపు 4 లక్షల పాస్‌పుస్తకాలు పంపిణీకి సిద్ధం చేసింది. వచ్చే మార్చి నాటికి మిగిలిన 8,582 గ్రామాల్లో 56 లక్షలకు పైగా పట్టాదారు పాస్‌పుస్తకాలను అందించి కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న గ్రౌండ్ రెంట్ స్థలాల సమస్య పరిష్కారానికి కీలక అడుగు పడనుంది. అమలాపురం, అంబాజీపేట, ముమ్మిడివరం, రామచంద్రాపురం ప్రాంతాల్లోని కొన్ని నివాస గ్రౌండ్ రెంట్ స్థలాలు పాత రెవెన్యూ వర్గీకరణ కారణంగా రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A(1)(b) కింద నిషేధిత ఆస్తుల జాబితాలో కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఈ స్థలాలు దీర్ఘకాలంగా నివాసాలుగా ఉండి, అనేక చోట్ల శాశ్వత నిర్మాణాలు వెలిశాయి. 1984 నుంచే గ్రౌండ్ రెంట్ వ్యవస్థ నిలిచిపోయినప్పటికీ, పాత రెవెన్యూ రికార్డుల్లోని వర్గీకరణ కారణంగా ఆయా కుటుంబాలు ఆస్తి లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
క్షేత్రస్థాయి విచారణలు, పాత రెవెన్యూ రికార్డులు, సర్వే వివరాలు, గత రిజిస్ట్రేషన్ లావాదేవీలను పరిశీలించిన అనంతరం, నివాస గ్రౌండ్ రెంట్ స్థలాలను గ్రామకంఠం భూములతో సమానంగా పరిగణించి 22-A నిషేధిత జాబితా నుంచి ప్రత్యేక కేటగిరీగా తొలగించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ నిర్ణయం అమలైతే 1,416 మంది నివాసితులకు ప్రయోజనం చేకూరనుండగా, 56.37 ఎకరాల భూమికి ఆంక్షల నుంచి విముక్తి, 1,281 సర్వే నంబర్లకు సంబంధించిన సమస్యకు పరిష్కారం లభించనుంది. అంబాజీపేట, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రాపురం ప్రాంతాల కుటుంబాలతో పాటు, ప్రత్యేక చారిత్రక నేపథ్యం ఉన్న మాచవరం గ్రామంలోని జయంతినగర్‌లో గుర్తించిన 32 మంది అర్హులైన నివాసితులకు కూడా ఈ చర్య ద్వారా ప్రయోజనం కలగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలకు ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చూపుతోంది. గత నెలలో ఏలూరు జిల్లాలో కలిదిండి మండలం గురవాయిపాలెం, ముదినేపల్లి మండలం వైవాక, మండవల్లి మండలం ఉనికిలిలో నిషేధిత జాబితాలో ఉన్న భూములకు 22-A నుంచి విముక్తి కల్పించారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ దీర్ఘకాలంగా వివాదాల్లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరిస్తూ వేలాది కుటుంబాలకు ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తోంది. వ్యవసాయానికి సాగునీరు ఎంత ముఖ్యమో, రైతు జీవితానికి భూమిపై స్పష్టమైన హక్కు కూడా అంతే ముఖ్యమనే భావనతో ప్రభుత్వం పనిచేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.
