జలం జీవం, జీవితం.. నీరుంటేనే సాగు బాగు అంటూ పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రలోకి అడుగుపెట్టాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి ప్రవహించిన గోదారమ్మకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. పవిత్ర జలాలను శిరస్సుపై చల్లుకుని అనంతరం అక్కడే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అనకాపల్లికి గోదారమ్మ తరలివచ్చిన భావోద్వేగ వాతావరణం మధ్య పోలవరం ఎడమ కాలువలో నిల్చుని గోదావరి జలాలకు పుష్పాలు, పసుపు కుంకుమ సమర్పించిన సీఎం జలహారతి ఇచ్చారు. కాలువకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో చేరిన స్థానికులు, రైతులు, మహిళలు పుష్పాలతో జలాలకు స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చారు. అరుణవర్ణంలో పరవళ్లు తొక్కుతూ వస్తున్న గోదావరి జలాలకు సీఎం సాష్టాంగ నమస్కారం చేశారు. గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జలహారతి అనంతరం క్రాస్ రెగ్యులేటర్ వద్దకు చేరుకుని స్థానిక రైతులతో కలిసి రెగ్యులేటర్ గేట్లను సీఎం ఎత్తారు.
ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా విడుదల చేసిన నీటితో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లోని 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9.23 లక్షల మందికి తాగునీరు ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక చేసింది. తాండవ, వరహా, శారదా నదులతో పాటు ఏలేరు కాలువపై సైఫన్లు, ఆక్విడెక్టులను నిర్మించారు. ఎడమ కాలువ కోసం ఇప్పటివరకు రూ.4,192 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసింది. ఈ నీటితో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేలా జల వనరుల శాఖ ప్రణాళిక చేసింది. గోదావరి జలాలతో పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80 వేల ఎకరాలు, పంపా కింద 12 వేల ఎకరాలు, తాండవ, వరహా, మామిడి గెడ్డ ఆయకట్టు పరిధిలో ఉన్న 46,620 ఎకరాల స్థిరీకరణ జరుగనుంది. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పారిశ్రామిక అవసరాలకు, తాగు, సాగునీటి అవసరాల కోసం 23.44 టీఎంసీల నీటిని తరలించేలా ప్రణాళిక చేసినట్టు జల వనరుల శాఖ అధికారులు సీఎంకు వివరించారు.
ఉత్తరాంధ్రలో బీళ్లన్నీ ఇక పంటలే
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు వచ్చాయని, ఇక ఈ ప్రాంతంలోని బీళ్లన్నీ పంటలు పండుతాయని అన్నారు. గోదావరి మూడు పాయలు గౌతమి, వశిష్ఠ, వైనతేయ సముద్రంలో కలుస్తుంటే, ఇప్పుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి తరలివచ్చిందని పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి సూర్యనారాయణ స్వామి వద్దకు, వంశధార వరకూ గోదావరి జలాలను తరలిస్తామని చెప్పారు. తొలి దశలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు అందేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి ఇప్పటివరకు రూ.4,192 కోట్లు ఖర్చు చేశామని, మరో రూ.800 కోట్లు ఖర్చు చేసి మొత్తం పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. తాళ్లపాలెంలో భూ వివాదాన్ని పరిష్కరించి నిర్వాసితులకు పునరావాసం కల్పించామన్నారు. ఎడమ కాలువలో ప్రవహిస్తున్న ప్రతి నీటి చుక్క వెనుక ఇంజినీర్ల ప్రతిభ, కార్మికుల కష్టం, రైతుల నిరీక్షణ, నిర్వాసితుల త్యాగం, ప్రభుత్వ సమర్థత ఉన్నాయని సీఎం పేర్కొన్నారు.
కూటమి వచ్చాక పోలవరానికి శాప విముక్తి
2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు సాకారం కావడానికి ఏడు ముంపు మండలాలను రాష్ట్రంలో విలీనం చేసేలా కృషి చేశానని చంద్రబాబు తెలిపారు. ప్రతి సోమవారాన్ని 'పోల వారం'గా మార్చుకుని 2019 వరకు 72 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, డయాఫ్రాం వాల్ దెబ్బతిన్నదని ఆరోపించారు. 2024లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం ద్వారా ప్రజలే పోలవరానికి శాప విముక్తి కల్పించారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకురావడం అంత సులభంగా జరగలేదని, గంటలు, రోజుల వారీగా లక్ష్యాలు పెట్టుకుని పనులు పరుగులు పెట్టించామని తెలిపారు. ఎడమ ప్రధాన కాలువను మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానం చేస్తామని, రూ.3,200 కోట్లతో ఉత్తరాంధ్రలోని 12 ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు చెప్పారు. వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, గత రెండేళ్లలో సాగునీటి రంగంలో రూ.25 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. గోదావరి-కృష్ణా సహా రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇస్తానని ప్రకటించారు. 2015 సెప్టెంబరు 16న పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తీసుకెళ్లానని, 2017 ఆగస్టు 15న పురుషోత్తపట్నం ఎత్తిపోతలను ప్రారంభించానని, ఇప్పుడు 2026 సెప్టెంబరు 2న గోదావరి జలాలను అనకాపల్లికి తీసుకువచ్చానని గుర్తుచేసుకున్నారు. సీఎంగా ఉన్న ప్రతిసారీ సాగునీటి ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కోసమే పనిచేశానని వివరించారు.
ఇక ఉత్తరాంధ్రకే వలసలు
నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి భద్రత ఉంటుందని సీఎం చెప్పారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయని, ఆరు నెలల క్రితం అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. పెద్ద డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు వస్తున్నాయని, ఆసియా మొత్తాన్ని అనుసంధానించే సబ్‌సీ కేబుల్ కనెక్టివిటీ కూడా రానుందని తెలిపారు. హార్బర్లు, మూలపేట పోర్టుల ద్వారా తూర్పు తీరాన్ని మధ్య భారత్‌తో అనుసంధానిస్తామని, హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి తరహాలో అనకాపల్లి అభివృద్ధికి చిరునామాగా మారుతుందని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లడం కాదు, ఉత్తరాంధ్రకే వలసలు వచ్చే పరిస్థితి వస్తుందని, ఉత్తరాంధ్ర 'ఉన్నతాంధ్ర'గా మారుతుందని పేర్కొన్నారు. విశాఖ ఏఐ పట్నంగా, గూగుల్ హబ్‌గా, నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా మారుతుందని చెప్పారు. డేటా సెంటర్లకు నీరు, విద్యుత్ కొరత వస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. అన్ని డేటా సెంటర్లకూ కేవలం 5 టీఎంసీల నీరు సరిపోతుందని, ఎడమ కాలువ ద్వారా రోజుకు 2 టీఎంసీల నీరు తీసుకెళ్లే సామర్ధ్యం ఉందని వివరించారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు సభా వేదిక నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి, ఎడమ కాలువను వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేసిన జల వనరుల శాఖ ఇంజనీర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సహా మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, పి.నారాయణ, కె.అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కె.పార్ధసారధి, ఎంపీలు విజయ్, సీఎం రమేశ్ సహా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
