ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12వ పే-రివిజన్ కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సీఎం, పెండింగులో ఉన్న 4 డీఏల్లో 2 డీఏల విడుదలకు అంగీకరించారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన ఉద్యోగుల సమస్యలపై చర్చించి, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరించారు. రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలతతో ఉన్నామని తెలిపిన సీఎం, 1-7-2024, 1-1-2025లకు చెందిన రెండు డీఏలను 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లించేందుకు ఆమోదం తెలిపారు.
2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవులను వచ్చే సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాలో వేయడానికి, పోలీసులకు 1 అడిషనల్ సరెండర్ లీవ్‌ను ఈ దసరాకు చెల్లించేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రద్దు చేసిన పెన్షనర్ల అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్‌ను వచ్చే ఏడాది జనవరి నుంచి ఇచ్చేందుకు నిర్ణయించారు — 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం మేర వర్తింపజేయనున్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను స్ట్రీమ్‌లైన్ చేస్తూ వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు చెల్లింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయాలతో ఏటా రూ.2,880 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు కానుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత రెండేళ్లలో ఒకటో తేదీన క్రమం తప్పకుండా జీతాలు, పెన్షన్లు ఇస్తున్నామని, 11 వేల మంది సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేశామని తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల్లో ఇప్పటివరకు రూ.30,849 కోట్లు క్లియర్ చేసినట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వడ్డీలకు తెచ్చిన అప్పులపై ఆర్థిక సంస్థలతో చర్చించి రూ.1.50 లక్షల కోట్ల మేర వడ్డీలను రీ షెడ్యూల్ చేసి తగ్గించుకున్నామని, ప్రస్తుతం సరాసరి 9.1 శాతం వడ్డీని చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ఉద్యోగులను దూరంగా పెట్టి రివర్స్ పీఆర్సీ ఇచ్చిందని, రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌ను కూడా పెండింగులో పెట్టిందని సీఎం విమర్శించారు. తమ ప్రభుత్వం ఉద్యోగులను గౌరవిస్తుందని, సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉందని, ఆర్థిక వెసులుబాటు ఉంటే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. 2014లో విభజన తర్వాత ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసి 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
సీఎం ప్రకటనపై హాజరైన ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పీఎఫ్ లోన్లు కూడా ఇవ్వకుండా వేధించడం వల్ల పెళ్లిళ్లను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణకు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపునకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఉద్యోగులు వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
