కరవు నుంచి రాష్ట్రాన్ని కాపాడేది ఇరిగేషన్ ప్రాజెక్టులేనని... అందుకే తాను సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన తొలి రోజు 8వ కలెక్టర్ల సమావేశంలో ఎల్ నినో ప్రభావంపై తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
ఎల్ నినో వేళ రైతులకు అవగాహన కల్పించడంతోపాటు ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎల్ నినో కారణంగా పంటలు నష్టపోతే రైతులకు బీమా డబ్బులు వచ్చేలా చూడాలని, ఎట్టిపరిస్థితుల్లో రైతు నష్టపోకూడదని సూచించారు. ఈ విపత్తు కాలంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేసిన సీఎం... తాను ఇకపై ప్రతి వారం ఎల్ నినో ప్రభావంపై సమీక్షిస్తానని, క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతానని తెలిపారు. మంత్రులు, అధికారులు, కలెక్టర్లు కూడా నిరంతరం క్షేత్ర స్థాయిలో ఉంటూ రైతుల్లో, ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ధరల నియంత్రణకు యాక్షన్ ప్లాన్: "ఎల్ నినో ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. తాగునీటికి, పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. వర్షాధార పంటలను ప్రోత్సహించాలి. నీటి ఇబ్బందులే కాదు... ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. పంటలు సరిగా పండవు కాబట్టి నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది" అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ధరలను అదుపులో పెట్టేలా ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన ఆయన, భవిష్యత్తులో ఏ పంటలకు డిమాండ్ ఉంటుందో అంచనా వేసి ఆ పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని, అవసరమైతే రాయితీపై విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు. డిమాండ్ ఉన్న పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించే అంశాన్ని కూడా పరిశీలించాలన్నారు. ఉల్లి, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల వంటి పంటలను ప్రోత్సహిస్తూ మల్టీ క్రాప్స్ వేసేలా చూడాలని, రైతు బజార్లను యాక్టివేట్ చేయాలని కూడా సూచించారు.
బీమానే రైతులకు ధీమా: రైతులు ఏయే పంటలకు బీమా చేయించారో తెలుసుకుని, అదే పంటలు వేయించడం ద్వారా బీమా మొత్తాలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు దీనిపై స్పష్టమైన జాబితాలు సిద్ధం చేసుకుని రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎల్ నినో విపత్తు కాలంలో ప్రకృతి వ్యవసాయాన్ని, పీఎండీఎస్ విధానాన్ని ప్రోత్సహించాలని, పచ్చదనం తగ్గకుండా వర్షాధార పంటలు, పశుగ్రాసం, మల్చింగ్ కోసం విత్తనాలు వేయించాలని సూచించారు. విత్తనాలను డ్రోన్ల ద్వారా చల్లించే విధానాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని కూడా చెప్పారు.
క్షేత్ర స్థాయిలో ఉండాలి... రైతుల్లో అవగాహన పెంచాలి: "విపత్తులను ఆపలేం. కానీ ప్రజలపై ఆ విపత్తుల ప్రభావం పడకుండా చూడడమే ప్రభుత్వాల బాధ్యత" అని సీఎం చంద్రబాబు అన్నారు. 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాలేదని, అవి పూర్తై ఉంటే ఎల్ నినో లాంటి విపత్తుల్లోనూ ఇబ్బందులుండేవి కావని పేర్కొన్నారు. ఈ సీజన్లో పట్టిసీమ నుంచి ఇప్పటివరకూ 39.5 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తీసుకువచ్చామని, ఈ నీటితోనే తీవ్రమైన ఎల్ నినో పరిస్థితుల్లోనూ డెల్టాలోని లక్షల ఎకరాల సాగును కాపాడగలిగామని వివరించారు.
వచ్చే వేసవి వరకూ ప్రణాళికలు: 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను 3 ఏళ్లలోగా పూర్తి చేయాలని, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ, హంద్రీనీవా కాలువను వేగంగా పూర్తి చేసిన స్ఫూర్తితోనే వీటిని కూడా పూర్తి చేయాలని సీఎం సూచించారు. నిర్దేశిత గడువులోగా, నెల ముందే ప్రాజెక్టులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు, అధికారులకు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. ఈ నెలలోనే గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపిన ఆయన, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చెరువులను నింపాలని, వచ్చే వేసవి వరకూ నీటి సరఫరా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అన్నమయ్య జిల్లా తరహాలో అంతర్గత బేసిన్లను అనుసంధానించి భూగర్భ జలాలను పెంచాలని, ఎల్ నినో సంక్షోభ సమయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
