తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకూ వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లంతా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రిజర్వాయర్లు, నదులకు వచ్చే నీటిని అంచనా వేసుకుని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి వరకూ సూచనలు జారీ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లాల్లోకి వచ్చే ఇన్‌ఫ్లోను అంచనా వేసుకుని జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ రాత్రికి వాయుగుండం తీరం దాటుతున్న నేపథ్యంలో రేపు వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంటుందని, 24, 25 తేదీల్లో జిల్లా కలెక్టర్లు అలెర్ట్‌గా ఉండాలని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో కొంతమేర వరి దెబ్బతిన్నాయని, ఎంతమేర దెబ్బతిన్నాయో అంచనా వేయాలని ఆదేశించారు.
వర్ష ప్రభావం ఉన్న జిల్లాల్లో రేపు కూడా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని సూచించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నీరు, ఆహారం, మెడిసిన్‌తో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను కూడా వెనక్కి వచ్చేలా చర్యలు చేపట్టారు.
టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లాలు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, ఏఎస్ఆర్, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాల వారీ వర్షపాతం నమోదు, చేపట్టిన చర్యలపై కలెక్టర్లను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఒంటిగంటకు తీరం దాటనున్న వాయుగుండం
ఈ రాత్రి ఒంటిగంటకు పోలాకి వద్ద వాయుగుండం తీరం దాటుతుందని డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
