శాఖలు, అంశాలపై గంటల తరబడి రివ్యూలు చేయడం కాదు... రిజల్ట్స్ కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను, అధికారులను నిర్దేశించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ప్రారంభమైన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశానికి సీఎం అధ్యక్షత వహించారు. ప్రజా సేవకులుగా ఉందాం... ఈగోలు వద్దు అని కలెక్టర్లకు సూచించిన సీఎం, గత సమావేశంలో నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టులు ఇక నుంచి తప్పనిసరి కావాలన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... "27 నెలల్లో అనేక వ్యవస్థాగత మార్పులు చేశాం. ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి. 28 కొత్త పాలసీలతో అవకాశాలను అన్‌లాక్ చేశాం. రియాక్టివ్ గవర్నెన్స్ నుంచి ప్రో యాక్టివ్ గవర్నెన్స్‌కు వెళ్లాలి. ఫైల్ పెండింగ్ అంటే అభివృద్ధి పెండింగే. ఫిర్యాదు పెండింగ్ అంటే ప్రజలకు న్యాయం పెండింగ్" అని అన్నారు. విజన్ ఉన్నా అమలు చేయకుంటే అవి నెరవేరని ఆశలుగానే మిగిలిపోతాయని, ఇప్పుడు పనిచేస్తేనే సరిపోదని, ఫేక్ ప్రచారాలకు కూడా కౌంటర్ ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని మభ్యపెట్టే నివేదికలు వద్దు, వాస్తవాలు చెప్పాలని ఆదేశించిన సీఎం, రెండు రోజుల పాటు 12 గంటలు జరిగే ఈ కాన్ఫరెన్స్ చాలా కీలకమని పేర్కొన్నారు. సమస్యను దాచిపెడితే పెద్దది అవుతుందని, ఓపెన్‌గా చర్చిస్తే పరిష్కారం లభిస్తుందని, సాధారణ పరిపాలన కాదు ప్రజలు మెచ్చే సుపరిపాలన కావాలని అన్నారు. శాఖలు, జిల్లాలు, సెక్రటరీలు, కలెక్టర్ల మధ్య పోటీ ఉండాలని, బెస్ట్ ప్రాక్టీసెస్, బెస్ట్ పాలసీలు పంచుకోవాలని సూచిస్తూ... "వన్ స్టేట్-వన్ విజన్-వన్ టీమ్-వన్ మిషన్... అదే స్వర్ణాంధ్ర" అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

టీమ్ సక్సెస్‌తోనే అభివృద్ధి: లీడర్షిప్ అంశంపై ఈసారి కలెక్టర్ల సదస్సులో ప్రత్యేకంగా చర్చించాలని, కొన్ని చోట్ల లీడర్షిప్ లోపం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సామర్థ్యం పెంచేందుకు ఇప్పటివరకూ 1.50 కోట్ల కోర్సులు నిర్వహించామని, డీప్ టెక్ గవర్నెన్స్‌తో అనూహ్య ఫలితాలు సాధించే అవకాశం ఉందని, గతంలో 50 ఏళ్లలో చేసే అభివృద్ధిని ఇప్పుడు 10-15 ఏళ్లలోనే సాధించే ఆస్కారం ఉందని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా 27 నెలల్లో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టామని, సంక్షేమానికి రూ.1.40 లక్షల కోట్లు, అభివృద్ధికి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్-1, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టులు పూర్తి చేశామని, పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు.

సాగునీటి రంగంలో తన కృషిని గుర్తిస్తూ ఎకనామిక్ టైమ్స్ పత్రిక 'సీఈఓ టు వాటర్‌మాన్' పేరిట కథనం రాయడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. "గ్లోబల్ డ్రీమ్ కేబినెట్‌లో నా పేరు వచ్చినప్పుడు, సీఈఓ సీఎం అన్నప్పుడు కూడా నేను ఇంత ఆనందించలేదు" అని చెప్పిన సీఎం, గోదావరి-కావేరీ-మహానది-గంగా వంటి నదులు అనుసంధానమై వాటర్ గ్రిడ్ ఏర్పాటైతే భారత అభివృద్ధి అన్‌స్టాపబుల్ అవుతుందని పేర్కొన్నారు. 36 ప్రాజెక్టుల కోసం క్యాలెండర్ ఇచ్చామని, వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారం, అధికారుల తోడ్పాటుతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, ఇది టీమ్ సక్సెస్ అని చెప్పారు.

అవకాశాలను అన్‌లాక్ చేయండి: ప్రతి జిల్లాలోనూ 25 టాప్ ప్రాజెక్టులను, ప్రతి నియోజకవర్గానికి 10-15 ప్రాధాన్యతాంశాలను గుర్తించి అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో గ్రోత్ ఇంజన్లను గుర్తించి సంపద, ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని, కొత్త అవకాశాలు అందిపుచ్చుకుని ఏలూరు జిల్లా అత్యుత్తమ జిల్లాగా మారిందని ఉదాహరణగా చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తూ సమస్యలకు సత్వరం స్పందించాలని, జిల్లా కలెక్టర్లుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి జ్ఞాపకాలు మిగుల్చుకోవాలని కలెక్టర్లకు సూచించారు. "నాకు పరిపాలన కంటే సుపరిపాలన ముఖ్యం" అని స్పష్టం చేశారు.

నెలవారీ నివేదికలతో అభివృద్ధి ప్రయాణం: ప్రతి నెలా ఆర్థిక నివేదిక విడుదల చేస్తూ లక్ష్యాలను బేరీజు వేసుకుంటున్నామని, 2022-23 బేస్ ఇయర్‌గా ప్రస్తుత ధరలకు అనుగుణంగా 13.44 శాతం వృద్ధి రేటు నమోదైందని సీఎం వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే రూ.25,450 కోట్ల మేర పెరిగాయని, 120 ఏళ్ల నాటి భూ సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామని, 1908 నుంచి అమలాపురంలో పెండింగ్‌లో ఉన్న గ్రౌండ్ రెంట్ భూముల విషయంలో నిర్ణయం తీసుకుని 1,416 మందికి పట్టాలు ఇచ్చామని చెప్పారు. 2027 నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని, ప్రస్తుత 13.44 శాతం వృద్ధి రేటును 15 శాతానికి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

ఇద్దరు మహిళా అధికారులకు సీఎం ప్రశంసలు: ఫేక్ ప్రచారంతో సమస్యలు సృష్టించే ప్రయత్నాలపై వేగంగా స్పందించి కౌంటర్ ఇవ్వాలని, సరైన సమయంలో స్పందించకపోతే ఆ శిక్ష ప్రభుత్వానికి పడుతుందని సీఎం హెచ్చరించారు. డీఎస్సీ-2025లో ఎక్కడా తప్పు జరగలేదని, స్పోర్ట్స్ కోటాలో నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టం చేస్తూ, దుష్ప్రచారానికి చక్కగా కౌంటర్ ఇచ్చిన ఇద్దరు మహిళా అధికారులను సీఎం అభినందించారు. గత ప్రభుత్వ హయాంలో మార్కెట్లోకి వచ్చిన నకిలీ మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారని, కల్తీ బ్రాండ్లన్నీ రద్దు చేసి పారదర్శకంగా విక్రయాలు జరిగేలా చూస్తున్నామని చెప్పారు. తీవ్ర ఎల్ నినో ప్రభావంతో ఈసారి 54 శాతం లోటు వర్షపాతం నమోదైందని, గతేడాది 85 శాతం ఉన్న రిజర్వాయర్ నిల్వలు ఈసారి 57 శాతానికి పడిపోయాయని, గత పాలకుల నిర్లక్ష్యంతో పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తి కాలేదని, జల్ జీవన్ మిషన్‌ను కూడా సరిగ్గా వినియోగించుకోలేదని విమర్శించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి రాజీ లేదని, సంక్షోభంలోనే కలెక్టర్ల నాయకత్వం వెలుగు చూడాలని పేర్కొన్నారు.

సీఈఓ టు వాటర్ మ్యాన్: ఎకనమిక్ టైమ్స్‌లో వచ్చిన వాటర్ మ్యాన్ కథనాన్ని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సాగునీటి రంగంలో సీఎం చంద్రబాబు కృషిని అభినందిస్తూ ప్రతిపాదించగా, మొత్తం సభ నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. "నీటి వనరుల రంగంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం సాధించిన విజయాలను దేశం గుర్తించింది. వెలిగొండ, పోలవరం ఎడమ కాలువల ద్వారా నీటి విడుదలపై వివిధ రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది" అని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ టెక్నాలజీని తీసుకువచ్చి అమలు చేశామని, పట్టిసీమ ప్రాజెక్టు నుంచి ఇప్పటివరకూ 500 టీఎంసీల నీటిని తరలించగలిగామని, ప్రకాశం బ్యారేజీని 200 సార్లు నింపగలిగామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టించిన నిశ్శబ్ద నీటి ప్రయాణాన్ని రాష్ట్ర ప్రజలు, దేశం కూడా గుర్తించిందని, రైతుల కోసం సీఎం పడుతున్న తపనను ఎకనమిక్ టైమ్స్ వాటర్ మ్యాన్‌గా కీర్తిస్తూ రాసిందని అన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మంత్రులు, సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.