రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించి ఐదు నూతన మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సెప్టెంబర్ 9న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణల్లోని 17 జిల్లాల మీదుగా వెళ్లే ఈ ఐదు ప్రాజెక్టులు భారత రైల్వే పరిధిని దాదాపు 540 కిలోమీటర్ల మేర పెంచనున్నాయి.
పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఆధారంగా రూపొందించిన ఈ ప్రాజెక్టులు, సమగ్ర ప్రణాళిక, భాగస్వాముల సంప్రదింపుల ద్వారా మల్టీ మోడల్ అనుసంధానతను, రవాణా సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. 2029-30 నాటికి వీటిని పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
- అరక్కోణం- రేణిగుంట 3, 4వ లైన్ — 77 కిలోమీటర్లు
- వైట్ ఫీల్డ్- బంగారుపేట 3, 4వ లైన్ — 47 కిలోమీటర్లు
- హోసూర్- ఒమలూర్ డబ్లింగ్ (రెండు లైన్ల నిర్మాణం) — 147 కిలోమీటర్లు
- సేలం- కరూర్- దిండిగల్ డబ్లింగ్ — 159 కిలోమీటర్లు
- సికింద్రాబాద్ మల్టీ ట్రాకింగ్ (ఘట్కేసర్)- కాజీపేట్ — 110 కిలోమీటర్లు
52 లక్షల జనాభాకు మెరుగైన అనుసంధానం
ఈ ఐదు ప్రాజెక్టుల ద్వారా సుమారు 52 లక్షల జనాభా గల దాదాపు 2,121 గ్రామాలకు అనుసంధానం మెరుగుపడనుంది. రైలు మార్గాల సామర్థ్యం పెరగడం వల్ల రవాణా సౌలభ్యం మెరుగవుతుందని, భారత రైల్వేల నిర్వహణ సామర్థ్యం, సేవలపై విశ్వాసం పెరుగుతాయని కేంద్రం తెలిపింది. కార్యకలాపాల క్రమబద్ధీకరణకు, రద్దీని తగ్గించేందుకు ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు దోహదపడతాయి.
పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రైలు అనుసంధానం
తిరుపతి, తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, కోటిలింగేశ్వర దేవాలయం, బంగారు తిరుపతి, కోలార్ బంగారు గనులు, హోగెనక్కల్ జలపాతం, హోసూర్ కోట, మెట్టూర్ డ్యామ్, కొడైకెనాల్ కొండలు, సత్యమంగళం వన్యప్రాణుల అభయారణ్యం, నమక్కల్ ఆంజనేయర్ ఆలయం, యాదగిరిగుట్ట ఆలయం, భువనగిరి కోట తదితర ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు రైలు అనుసంధానం మెరుగుపడనుంది.
సరకు రవాణాకు, పర్యావరణానికి మేలు
బొగ్గు, సిమెంట్, ఇనుము-ఉక్కు, కంటైనర్లు, ఆటోమొబైల్స్, ఆహారధాన్యాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల రవాణాకు ఈ ప్రాజెక్టులు కీలక మార్గాలుగా మారనున్నాయి. దీనివల్ల ఏటా అదనంగా 47 ఎంటీపీఏ (మిలియన్ టన్నుల) సరకు రవాణా సాధ్యమవుతుందని, సుమారు 8 కోట్ల లీటర్ల చమురు దిగుమతిని, 42 కోట్ల కిలోల కర్బన ఉద్గారాలను తగ్గించనున్నట్టు కేంద్రం వెల్లడించింది — ఇది సుమారు 2 కోట్ల మొక్కలు నాటడంతో సమానమని పేర్కొంది.