కాకినాడలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పార్టీ సీనియర్ నేత, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
అనంతరం మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై, పక్షపాత తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్షాలపై, ప్రజలపై అక్రమ కేసులు, నోటీసులతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ప్రజలకు స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, సమానత్వపు హక్కులు రాజ్యాంగం ఇచ్చినవి తప్ప, ఏ ముఖ్యమంత్రి ఇచ్చినవి కావని బొత్స వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలను రాజకీయ కోణంలో చూడటం, అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకలను నొక్కలని చూడటం బ్రిటిష్ పాలనను తలపిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.
