విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి, సంక్షేమం, సాంకేతికత రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న తీరు, ఆయన 25 ఏళ్ల ప్రజా జీవిత ప్రస్థానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 'సేవా సంకల్ప అభియాన్' నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు.

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ నెలరోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా భారీ రక్తదాన శిబిరాలు నిర్వహించి అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించే లక్ష్యంతో కార్యక్రమాలు చేపడతామన్నారు. అదే రోజు సాయంత్రం 'ఆశీర్వాద దీపం' కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో దేశ సేవలో మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ దీపాలు వెలిగించనున్నట్లు తెలిపారు.

ఏపీ అభివృద్ధికి కేంద్రం అండ
'డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌–ట్రిపుల్‌ ఇంజన్‌ గ్రోత్‌' ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పీవీఎన్ మాధవ్ తెలిపారు.