అయోధ్య రామమందిరంలో వసూలైన విరాళాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో దోషులుగా తేలిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విజ్ఞప్తి మేరకు జూన్ 13న రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. దేవాలయంలో పనిచేస్తున్న పలువురికి అధికారికంగా నిర్దిష్ట బాధ్యతలు కేటాయించకుండా, మౌఖిక ఆదేశాల ఆధారంగానే కీలక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు విచారణలో గుర్తించారు.
దేవోరియాలో ఒక బహిరంగసభలో మాట్లాడుతూ.. అయోధ్య యావత్ సనాతన ధర్మ విశ్వాసానికి ప్రతీక అని, రాముని గౌరవాన్ని కాపాడటం అందరి బాధ్యత అని సీఎం యోగి పేర్కొన్నారు. సిట్ నివేదిక అందిన వెంటనే చర్యలు ప్రారంభమయ్యాయని, నిజానిజాలు నిగ్గు తేలుస్తామని హామీ ఇచ్చారు.
ప్రజల విశ్వాసంతో ఎవరూ చెలగాటమాడేందుకు వీల్లేదని, దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై నిరాధార వ్యాఖ్యలు చేయవద్దని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించవద్దని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేశారు.
అయోధ్యలో నిత్యం లక్షలాది మంది భక్తులు రామమందిరాన్ని సందర్శిస్తుండటంతో, విరాళాల నిర్వహణలో పారదర్శకత కోసం సాంకేతిక పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని ట్రస్టుకు ప్రభుత్వం సూచించింది.
