అనకాపల్లి, అక్టోబర్ 30 (ఎక్స్‌ప్రెస్ టుడే): సామాజిక భద్రతే ధ్యేయంగా ప్రభుత్వం అందిస్తున్న "ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ"లో భాగంగా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని ఫైర్ ఆఫీస్ కాలనీలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ చేతుల మీదుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులు అందజేశారు.

గొల్లగాని లక్ష్మి, చీపురుపల్లి లక్ష్మి, అద్దాల సూర్యకాంతం, పంచదారలో లేపాక్షి నందన్ తదితర లబ్ధిదారులకు అధికారులు స్వయంగా ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్మును చేతికి అందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ సమయానికి అందేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా లబ్ధిదారుల ఇంటి గుమ్మం వద్దకే వచ్చి ప్రతి నెలా పింఛన్ డబ్బులు అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

పింఛన్ పంపిణీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా జరిగేలా సచివాలయ సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.

కాలనీకి చెందిన వృద్ధులు, దివ్యాంగుల నివాసాలకు వెళ్లి పింఛన్ డబ్బులు చేతికి అందించడంతో లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరిశాయి. నేరుగా జిల్లా కలెక్టరే తమ ఇంటికి వచ్చి పలకరించి పింఛన్ అందించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, మున్సిపల్ కమిషనర్ డి.జె.ఎస్.పి. రాజు, స్థానిక సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.