విజయనగరం, అక్టోబర్ 30 (ఎక్స్‌ప్రెస్ టుడే): గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. జీవన రాణి హెచ్చరించారు.

శుక్రవారం మధ్యాహ్నం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఆమె అధ్యక్షతన గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ నిర్ధారణ పద్ధతుల చట్టం–1994, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం అమలుపై జిల్లా స్థాయి, ఉప జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి స్కానింగ్ కేంద్రంలో టోల్ ఫ్రీ నంబర్ 18002332447ను రోగులు, ప్రజలకు కనిపించే విధంగా స్కానింగ్ గది వెలుపల తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. గర్భస్థ పిండ పరీక్షలు, వ్యాధుల నిర్ధారణ తదితర వైద్య అవసరాలకు మాత్రమే స్కానింగ్ యంత్రాలను వినియోగించాలని, ప్రభుత్వం నిర్దేశించిన చట్టాలు, నిబంధనలను ప్రతి కేంద్రం తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

సంబంధిత ప్రోగ్రామ్ అధికారులు స్కానింగ్ కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, చట్టాల అమలును పర్యవేక్షించాలని కమిటీ సభ్యులు సూచించారు.

అలాగే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ చట్టం–2021, సరోగసీ రెగ్యులేషన్ చట్టం–2021 ప్రకారం జిల్లాలోని ఫెర్టిలిటీ కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని డా. ఎస్. జీవన రాణి ఆదేశించారు.

ఈ సమావేశంలో నోడల్ అధికారి, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. సూర్యనారాయణ, అదనపు డీఎం అండ్ హెచ్ఓ, డి.ఎల్.ఎ.టి.బి. అధికారి డా. డి.ఆర్.కె. రాణి, వైద్య నిపుణులు డాక్టర్ బి. సుధ, డాక్టర్ నారాయణరావు, డాక్టర్ జి.కె. దుర్గా, డాక్టర్ అర్ణన, జిల్లా పంచాయతీ శాఖ ప్రతినిధి టి. పృధ్వీ, డాక్టర్ లంకా శ్రీనివాసరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి తరఫున ఏపీఆర్ఓ సిహెచ్. ప్రభుదాస్, డీఎం అండ్ హెచ్ఓ ఏఓ వెంకటరాజు, డీఈఎంఓ చిన్నతల్లి, ఐ/సి డీపీహెచ్‌ఎన్‌ఓ సన్యాసిరావు, డిప్యూటీ డీఈఎంఓలు ఎం. మహేశ్వరి, వి. చాముండేశ్వరి, మానిటరింగ్ కన్సల్టెంట్ పవన్ ఆశిష్, నేచర్ ఎన్‌జీఓ ప్రతినిధి జి.కె. దుర్గా, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.