విజయనగరం, అక్టోబర్ 1 (ఎక్స్‌ప్రెస్ టుడే): 2027 కల్లా జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి కోరారు.
కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ, ఈగిల్ టీమ్, టాస్క్ ఫోర్స్ సహకారంతో గంజాయి, మత్తు పదార్థాల రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రిస్తున్నట్లు తెలిపారు. సరిహద్దు జిల్లాల నుంచి వాహనాల ద్వారా, రైలు మార్గం ద్వారా జరిగే మాదక ద్రవ్యాల రవాణాను ఎప్పటికప్పుడు అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు.
డ్రగ్స్ నియంత్రణ అధికారి ఎప్పటికప్పుడు మందుల షాపులను తనిఖీ చేసి, నిషేధిత డ్రగ్స్‌పై నిఘా పెట్టాలని సూచించారు. ఇప్పటివరకు మత్తుపదార్థాల దుష్ప్రభావాలను వివరిస్తూ 8 లక్షల పాంప్లెట్లు, వాల్ పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ముఖ్యంగా పాఠశాల, కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్, మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యాశాఖ ద్వారా ప్రతినెలా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
