విజయనగరం, అక్టోబర్ 31 (ఎక్స్‌ప్రెస్ టుడే): దీపావళి పండుగ మరియు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో బాణసంచా విక్రయాలపై ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు.
జిల్లాలో బాణసంచా విక్రయాలు కేవలం అనుమతులు కలిగిన హోల్‌సేల్ లైసెన్స్‌దారుల ద్వారా మాత్రమే జరగాలని, హోల్‌సేల్ ప్రాంగణాల్లో రిటైల్ రూపంలో బాణసంచా విక్రయించడం పూర్తిగా నిషేధించబడిందని స్పష్టం చేశారు.
ప్రతి హోల్‌సేల్ వ్యాపారి ప్రభుత్వం, అగ్నిమాపక శాఖ నిర్దేశించిన భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. బాణసంచా నిల్వ, విక్రయాల సమయంలో అగ్నిప్రమాదాలు, ఇతర ప్రమాదాలు సంభవించకుండా అన్ని ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిబంధనలను ఉల్లంఘించి హోల్‌సేల్ ప్రాంగణాల్లో రిటైల్ విక్రయాలు చేపట్టినా, అనుమతులకు విరుద్ధంగా వ్యవహరించినా సంబంధిత వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్, ఎక్స్‌ప్లోజివ్ లైసెన్సులను తక్షణమే రద్దు చేయడంతో పాటు, పేలుడు పదార్థాల చట్టం ప్రకారం కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా వ్యాపారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అధికారుల తనిఖీలకు సహకరించాలని కలెక్టర్ సూచించారు.