విశాఖపట్నం, అక్టోబర్ 1 (ఎక్స్‌ప్రెస్ టుడే): భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, దేశవ్యాప్తంగా చేపట్టిన ‘సేవ సంకల్ప్ అభియాన్’లో భాగంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని విశాఖపట్నంలో ఖాదీ సంతను ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు తెలిపారు.
బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛ భారత్, గ్రామీణ చేతివృత్తులు, చేనేత కళలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, వారిని ప్రోత్సహించే సమున్నత లక్ష్యంతో ఈ ఖాదీ సంతను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రధాని మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ సంకల్పానికి అనుగుణంగా ప్రతి పౌరుడూ స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని కోరారు.
అక్టోబర్ 2, 3 తేదీల్లో శ్రీ కరక చెట్టు పోలమాంబ కళ్యాణ మండపంలో ఖాదీ సంత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఖాదీ సంత పోస్టర్‌ను విడుదల చేశారు.
“ప్రతి ఇంటా స్వదేశీ – ఇంటింటా స్వదేశీ” అన్న నినాదాన్ని ప్రతి ఒక్కరూ చేతివృత్తుల వారికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. “స్వదేశీ ఉత్పత్తులను ఆదరిద్దాం – స్వయం సమృద్ధ భారత్‌ను నిర్మిద్దాం” అనే ధ్యేయంతో దీనిని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
రాజకీయ అంశాలపై మాట్లాడుతూ, ఇండియా కూటమి అన్ని చోట్లా ఖాళీ అవుతోందని ఆయన అన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను విమర్శిస్తూ ఇదే వైఖరి అవలంబిస్తే కాంగ్రెస్ ముక్త భారత్ జరిగే రోజు దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు.
అంబేద్కర్‌ను అవమానపరిచిన, ఎమర్జెన్సీ విధించి దేశ ప్రజల తీర్పును అవహేళన చేసిన కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. దేశంలో ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించే విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. అధిష్ఠానం ఆదేశాలతో జీవీఎంసీ మేయర్ ఎన్నికల్లో ముందుకెళ్తామని ఆయన తెలిపారు.
