విశాఖపట్నం, అక్టోబర్ 18 (ఎక్స్‌ప్రెస్ టుడే): గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, ఎన్నికల ప్రక్రియ అమలు తీరును జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదివారం జిల్లాకు వచ్చిన ఎన్నికల పరిశీలకులకు వివరించారు.
జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎ. భార్గవ తేజ, వ్యయ పరిశీలకులు పి. వెంకట సందీప్ రెడ్డి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకోగా, కమిషనర్ తన ఛాంబర్లో వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ముందస్తు ఏర్పాట్లు, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, సంబంధిత అధికారుల బాధ్యతలు, ఎన్నికల నియమావళి అమలు తదితర అంశాలను వివరించారు. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను కమిషనర్ పరిశీలకులకు తెలియజేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.
అనంతరం జిల్లా ఎన్నికల పరిశీలకులు, వ్యయ పరిశీలకులు మేయర్ రిటర్నింగ్ అధికారి గదిని సందర్శించారు. అక్కడ జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లు, ప్రక్రియ నిర్వహణ తీరును గమనించారు. ఎన్నికల నిబంధనలను అనుసరిస్తూ నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఏమైనా ఫిర్యాదులుంటే తెలియజేయవచ్చు
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏమైనా సమస్యలున్నా, ఫిర్యాదులున్నా తనకు నేరుగా తెలియజేయవచ్చని జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎ. భార్గవ తేజ తెలిపారు. ఫోన్ నంబర్ 70955 99001 ద్వారా గానీ, లేదా addlcommissioner@apcrda.org ద్వారా గానీ తనను సంప్రదించవచ్చని సూచించారు.
అలాగే వ్యయ పరిశీలకులు పి. వెంకట సందీప్ రెడ్డి కూడా తన నంబర్‌ను వెల్లడిస్తూ ఏమైనా ఫిర్యాదులుంటే తనకు నేరుగా ఫోన్ నంబర్ 9440810041 ద్వారా లేదా sandeep333ecenitw@gmail.com ద్వారా తెలియజేయవచ్చని సూచించారు. జీవీఎంసీ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
