విశాల భారతావనిని ఏకతాటిపైకి తీసుకువచ్చిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ జీవితం మనందరికీ ఆదర్శప్రాయం, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో పోలీస్ శాఖ పాత్ర ఎంతో కీలకమైనది, పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలి, యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించాలి. - నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్.

విశాఖపట్నం, అక్టోబర్ 31 (ఎక్స్‌ప్రెస్ టుడే): సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, హోంమంత్రి, 'ఉక్కు మనిషి'గా ప్రసిద్ధి చెందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ దేశ చరిత్రలోనే అపూర్వమైన నాయకుడని, ఆయన దూరదృష్టి, నాయకత్వ పటిమ, పట్టుదలతో స్వాతంత్ర్యం అనంతరం భారతదేశంలోని 560కి పైగా సంస్థానాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి అఖండ భారత నిర్మాణానికి పునాది వేశారని కొనియాడారు.

దేశ సమైక్యత, సమగ్రత కోసం ఆయన చేసిన కృషి మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. భారతదేశం అనేది విభిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన ప్రజల సమాహారమని, మన మధ్య ఎన్ని భిన్నత్వాలు ఉన్నప్పటికీ, మనమంతా భారతీయులమనే భావనతో ఐక్యంగా ఉండటమే మన దేశ బలమని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశ ప్రత్యేకతని, ఈ ఐక్యతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని స్పష్టం చేశారు.

పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ముఖ్యంగా యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఐక్యతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా చట్టపరిధిలో సమర్థవంతంగా ఎదుర్కొంటూ, శాంతియుతమైన, సురక్షితమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలీసు కమిషనర్ పిలుపునిచ్చారు.