విజయవాడ, అక్టోబర్ 9 (ఎక్స్‌ప్రెస్ టుడే): విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని మారిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో గాంధీ శిల్ప బజార్‌ను (ప్రత్యేక ప్రదర్శన, అమ్మకం) శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ మనోహరన్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా ముఖ్య అతిథిగా హాజరు కానుండగా, సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ప్రదర్శనను ప్రారంభించనున్నారు.
కేంద్ర హస్తకళల అభివృద్ధి కమిషనర్, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో అక్టోబర్ 18 వరకు ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 70 మంది కళాకారులు, చేతివృత్తిదారులు ఇందులో పాల్గొంటారు.
కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కలంకారీ, చెక్క శిల్పాలు, టెర్రకోట, తోలుబొమ్మలు, క్రోషే లేస్ తదితర సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులను ప్రత్యేకంగా ప్రదర్శించి విక్రయించనున్నారు.
