తిరుమల, అక్టోబర్ 18 (ఎక్స్ప్రెస్ టుడే): తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. సూర్యమండల మధ్యవర్తిగా భక్తులకు అభయప్రదానం చేశారు.
ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించే సూర్యప్రభ వాహనసేవ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సూర్యమండల మధ్యవర్తిగా వెలుగొందుతున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
సూర్యప్రభ వాహనం – సకల జీవకోటికి చైతన్యప్రదాత
సూర్యభగవానుడు సకల జీవరాశులకు చైతన్యాన్ని, ప్రకృతికి వెలుగును, జీవకోటికి శక్తిని ప్రసాదించే ఆరోగ్యప్రదాతగా పూజలందుకుంటున్నాడు. సూర్యతేజంతోనే చంద్రుడు సైతం ప్రకాశిస్తున్నాడని పురాణాలు పేర్కొంటాయి. సూర్యప్రభ వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారి విహారం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, శ్రీమతి జానకీ దేవి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
