తిరుమల, అక్టోబరు 15 (ఎక్స్‌ప్రెస్ టుడే): శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
గజరాజుల ముందు నడక, మంగళవాయిద్యాల నాదం, భక్తబృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ప్రబంధ పారాయణం నడుమ వాహనసేవ వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారి కృపాకటాక్షాలు పొందారు.
కల్పవృక్ష వాహనం — కోరిన కోర్కెలు తీర్చే దివ్య వైభవం
క్షీరసాగర మథనంలో ఉద్భవించిన కల్పవృక్షం కోరిన ఫలాలను ప్రసాదించే దివ్య వృక్షంగా పురాణాలు పేర్కొంటాయి. అటువంటి కల్పవృక్ష వాహనంపై స్వామివారు దర్శనమివ్వడం భక్తులకు ఐహిక శుభాలు, సకలాభీష్టాల ప్రాప్తికి ప్రతీకగా నిలుస్తుంది.
రాత్రి సర్వభూపాల వాహనసేవ
గురువారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, జేఈఓ (విద్యా, ఆరోగ్యం) గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
