శ్రీకాకుళం, అక్టోబర్ 16 (ఎక్స్‌ప్రెస్ టుడే): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఎన్నికల మాన్యువల్‌ను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని, నిర్దేశిత గడువులోనే పనులన్నీ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని, నవంబర్ 3న ఎన్నికలు, 5న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని వెల్లడించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించామని, డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు ఇంచార్జ్‌లుగా, ఎంపీడీఓలు అసిస్టెంట్ అథారిటీలుగా వ్యవహరిస్తారని తెలిపారు.
పోలింగ్ స్టేషన్లలో తాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతుల బాధ్యతను పంచాయతీ రాజ్ ఎస్ఈకి, వాహనాల ఏర్పాట్లను ఉప రవాణా కమిషనర్‌కు అప్పగించామని పేర్కొన్నారు. అలాగే ఆయా జిల్లా ఉన్నతాధికారులు వారికి కేటాయించిన పనులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని, పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఫోటోలను వెంటనే తొలగించాలని, నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయాలని ఆదేశించారు.
సిబ్బంది నియామకం పూర్తయిందని, వారికి తక్షణమే శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన లాజిస్టిక్స్, రక్షణ ఏర్పాట్లను పూర్తి చేయాలని నోడల్ అధికారులకు సూచించారు. ప్రతి సెగ్మెంట్‌కు అవసరమైన మానవ వనరులను కేటాయించి, వారి విధులపై స్పష్టమైన సమన్వయం వహించాలని తెలిపారు.
రోజువారీ ఎన్నికల సన్నద్ధత, చెక్‌లిస్ట్‌ల వివరాలను ఉన్నతాధికారులకు క్రమం తప్పకుండా నివేదించాలని, కంట్రోల్ రూమ్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ క్షేత్రస్థాయి విధులను నిరంతరం పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ వెంకట్రామన్, సిపిఓ లక్ష్మీ ప్రసన్న, ఇతర జిల్లా స్థాయి నోడల్ అధికారులు పాల్గొన్నారు.
