న్యూఢిల్లీ, అక్టోబర్ 8 (ఎక్స్‌ప్రెస్ టుడే): 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవలో అరుదైన ఘనత సాధించిన ప్రధాని మోదీ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని చూపారని, క్రమశిక్షణ, నిబద్ధతతో దేశానికి సేవలు అందించారని అన్నారు. దూరదృష్టి, స్పష్టమైన లక్ష్యం, దృఢమైన నిర్ణయాలు, సమర్థవంతమైన పాలనతో భారత్‌ను ప్రపంచ శక్తిగా మలిచారని కీర్తించారు.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో భారతదేశ గమనాన్ని మార్చారని సీఎం చంద్రబాబు అన్నారు. ముఖ్యంగా సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను భాగస్వాములుగా చేసి వికసిత్ భారత్ వైపు దేశాన్ని నడిపిస్తున్నారని, అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ గౌరవాన్ని, విశ్వసనీయతను మరింత పెంచేలా తోడ్పడ్డారని చెప్పారు. రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.
నదుల అనుసంధానంపై ప్రతిపాదనలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిపిన భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రాభివృద్ధికి చెందిన వివిధ కీలక ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వ్యవసాయ, ఇరిగేషన్ వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
నీటిపారుదల రంగానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు తాజా నివేదికతో పాటు గోదావరి–కావేరి నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రధాని మోదీకి సీఎం వివరించారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానం జరిగితే దక్షిణాదిలోని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సమృద్ధిగా నీరు అందుతుందని చెప్పారు.
దేశవ్యాప్తంగా రహదారుల నెట్వర్క్, పవర్ గ్రిడ్ వంటివి ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలోనే జరిగాయని, ఇప్పుడు నదుల అనుసంధాన ప్రాజెక్టును ముందుకు తీసుకువెళితే వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని సీఎం చంద్రబాబు వివరించారు.
2027లో జరిగే గోదావరి పుష్కరాలకు రాష్ట్రంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని ప్రధానిని సీఎం కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి సైతం గోదావరి పుష్కరాలకు భక్తులు తరలి వస్తారని వివరించారు.
రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో 53 శాతం లోటు వర్షపాతం నమోదైందని, ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని ప్రధానికి సీఎం వివరించారు. కరవు నష్టాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
ఇటీవల కేంద్ర సహకారంతో మదనపల్లె కేంద్రంగా ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ లక్ష్యాలను కూడా ప్రధానికి తెలిపారు. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు.
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై వినతి
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర సహకారాన్ని సీఎం కోరారు. రాజధాని అమరావతిలో చేపడుతున్న ఔటర్ రింగ్ రోడ్డు వంటి అంశాలపై సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో చర్చించారు. విశాఖ మెట్రోను మంజూరు చేయాలని కోరారు. అలాగే బీచ్ రోడ్డు నిర్మాణం గురించి వివరించారు.
2047 నాటికి రాష్ట్రంలో అందరికీ అభివృద్ధి ఫలాలు సమానంగా అందేలా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర–2047 విజన్ గురించి ప్రధానికి సీఎం తెలిపారు.
