కర్నూలు, అక్టోబర్ 27 (ఎక్స్‌ప్రెస్ టుడే): ప్రజల ఆశీస్సులతో గెలిచి కర్నూలు నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. కర్నూలులోని ఆయన కార్యాలయంలో ఎంపీ బస్తీపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు గౌరు చరిత రెడ్డి, కె.ఈ.

శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూషతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కర్నూలు నగరంలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని మెడికల్ కాలేజీ వద్ద రహదారి సమస్యను పరిష్కరించామని మంత్రి తెలిపారు.

బళ్లారి చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని, నగరంలో 900 కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దాదాపు రూ.4 కోట్లతో ఔట్‌డోర్ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నామని, పార్కుల అభివృద్ధితో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల భవనాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీ తరహాలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కొత్త ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గడియారం ఆస్పత్రిని తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, గూడెం కొట్టాల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పట్టాలు అందించామని పేర్కొన్నారు. బీసీ భవన్, కాపు భవన్, ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధికి కూడా సహకారం అందిస్తున్నామని తెలిపారు.

పారిశ్రామిక పెట్టుబడులతో యువతకు ఉపాధి అవకాశాలు

కర్నూలు జిల్లాకు భారీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఓర్వకల్లులో రూ.7,000 కోట్లతో జాక్సన్ పరిశ్రమను తీసుకొస్తున్నామని, అక్కడ మరిన్ని పరిశ్రమల ఏర్పాటుతో భారీ పెట్టుబడులు వచ్చేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రిలయన్స్ రెండో దశ ప్రాజెక్టుతో జిల్లాకు మరిన్ని పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

గోల్డ్ మైన్, గ్రీన్‌కో ప్రాజెక్టులు జిల్లాకు రావడం పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. విశాఖపట్నంలోని డేటా సెంటర్ తరహాలో భారీ ప్రాజెక్టును కర్నూలుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్‌ను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పైలట్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభంతో యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయని, ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల ఏర్పాటుకు తగిన ప్రోత్సాహం లభించలేదని విమర్శించారు.

సంక్షేమ పథకాలతో ప్రజలకు అండ

కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని, అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.

వైసీపీది అబద్ధాల ప్రచారం.. మాది అభివృద్ధి ఆలోచన

వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతో అబద్ధాల ప్రచారం చేస్తున్నారని మంత్రి టీజీ భరత్ విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. వైసీపీ హయాంలో కర్నూలు జిల్లాకు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా రాజకీయ ప్రచారాలకే పరిమితం కావడం సరికాదని అన్నారు. తన ఎదుగుదలను వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. కర్నూలులో జరిగిన హత్యలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభివృద్ధికి మద్దతు ఇవ్వండి

కూటమిలో చిన్నచిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.