కర్నూలు, నవంబర్ 1 (ఎక్స్‌ప్రెస్ టుడే): టంగుటూరి ప్రకాశం పంతులు స్కూల్‌లో మంత్రి టీజీ భరత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కర్నూలులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా జరుగుతోందని తెలిపారు.

కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారని, చిన్నచిన్న ఘటనలకు వైఎస్సార్సీపీ నాయకులే కారణమని ఆయన ఆరోపించారు. నిబంధనలు పాటించకుండా, కార్ల పాస్‌లు లేకుండా వైఎస్సార్సీపీ నాయకులు తిరుగుతున్నారని, ఎన్నికల నిబంధనలు అందరికీ సమానమేనని, వాటిని ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు.

పోలింగ్ కేంద్రాల్లో రౌడీషీటర్లను ఏజెంట్లుగా కూర్చోబెట్టి ఓటర్లను భయపెట్టే ప్రయత్నం జరుగుతోందని, వైఎస్సార్సీపీ నాయకుల రెచ్చగొట్టే చర్యలను కూటమి కార్యకర్తలు ఎంతో సహనంతో ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు.

కర్నూలులో ఓటింగ్ శాతం పెరిగేలా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రతి ఓటరూ ఉత్సాహంగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కర్నూలులో 55 నుంచి 60 శాతం పోలింగ్ నమోదవుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.

ప్రజలంతా ఎన్నికల సరళిని గమనిస్తున్నారని, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ప్రజల తీర్పే అంతిమమని పేర్కొన్నారు.