కర్నూలు, అక్టోబర్ 24: కూటమికి ఓటు వేసి కర్నూలు నగర అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరంలో భారీ సైకిల్ యాత్ర నిర్వహించారు. 57, 59, 60, 55, 56వ వార్డుల్లో సైకిల్‌పై పర్యటిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
కూటమి మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూషను, 57వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి జ్యోతి, 59వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి వరలక్ష్మి, 60వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీలక్ష్మి, 55వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కొరకంచి రవి, 56వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సుంకన్నలను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కర్నూలు నగరంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే కూటమి అభ్యర్థుల విజయం అవసరమని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిస్తే నగర అభివృద్ధికి ఆటంకాలు కలిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు. రెండున్నరేళ్ల తమ పాలనలో ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. రూ. 50 వేల కోట్ల పెట్టుబడులు ఓర్వకల్లుకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ పెట్టుబడులు గ్రౌండింగ్ అయితే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. పెట్టుబడుల రాకతో కర్నూలు జిల్లా రూపురేఖలు మారిపోతాయన్నారు.
ఎంపీ బస్తీపాటి నాగరాజు మాట్లాడుతూ అభివృద్ధి చేసే కూటమికి ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మంత్రి టీజీ భరత్ నాయకత్వంలో కర్నూలు ఎంతో అభివృద్ధి అవుతోందన్నారు. మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూష మాట్లాడుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
ఇందిరాగాంధీ నగర్ ఆర్చ్ వద్ద ప్రారంభమైన సైకిల్ యాత్ర సీతారాం నగర్ ఆటో స్టాండ్, ఆయుష్మాన్ హాస్పిటల్, భగత్ సింగ్ నగర్, ఉమాదేవి హాస్పిటల్ మీదుగా నరసింహారెడ్డి నగర్ వాటర్ ట్యాంక్ వద్ద ముగిసింది. యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పలువురు రోడ్లపైకి వచ్చి పూలమాలలతో మంత్రికి స్వాగతం పలికి తమ మద్దతు తెలిపారు. ప్రధాన సర్కిళ్ల వద్ద మంత్రి టీజీ భరత్ మాట్లాడారు. అశోక్ నగర్ పంపు హౌస్ వద్ద గూడెం కొట్టాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సైకిల్ యాత్రకు మద్దతు తెలిపారు. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.
