కర్నూలు, నవంబర్ 5 (ఎక్స్ప్రెస్ టుడే): భక్తి, దైవ సంకల్పంతో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సొంత డబ్బులతో వైభవంగా నిర్మించడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
కర్నూలులోని శ్రీ చెంచులక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన విశేష అభిషేకము, మూలమంత్ర హోమము, హారతి, తీర్థ పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఆలయ నిర్మాణం వెనుక నిర్వాహకుల సంకల్పం, పట్టుదల ఎంతో గొప్పవని అన్నారు. వారి దృఢ సంకల్పం వల్లే ఇంత అద్భుతమైన ఆలయ నిర్మాణం పూర్తయిందని కొనియాడారు. ఇలాంటి గొప్ప ఆలయ నిర్మాణం కర్నూలులో జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా టీజీవీ గ్రూప్ తరఫున ఆలయానికి రూ.10 లక్షల విరాళాన్ని మంత్రి అందజేశారు. మంచి కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు తమ టీజీవీ గ్రూప్ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని తెలిపారు. కర్నూలులో ఇంత గొప్ప ఆలయం నిర్మాణం కావడం నగర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
ప్రజలందరూ ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని మంత్రి టీజీ భరత్ కోరారు.
