కర్నూలు, అక్టోబర్ 22: నగరపాలక సంస్థకు సంబంధించి స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ, బ్యాలెట్ బాక్సుల భద్రత, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అబ్జర్వర్ బి. అనిల్ కుమార్ రెడ్డి ఐఏఎస్, అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి నగర శివార్లలోని అథెనా స్కూల్‌లో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.

కౌంటింగ్ కేంద్రంలో పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్ కౌంటర్లు, బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు గదులు, అధికారుల రాకపోకలు, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల విధుల కోసం వచ్చే సిబ్బంది, అధికారులు, ఇతర సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.

ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రానికి వచ్చే వాహనాల పార్కింగ్‌కు తగిన స్థలాన్ని కేటాయించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

బ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టడంతో పాటు, ఓట్ల లెక్కింపు సమయంలో అవసరమైన భద్రతా ఏర్పాట్లు, అధికారుల విధుల నిర్వహణకు అనువైన వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని సూచించారు.