కృష్ణా నదీ జలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గత 12 ఏళ్లుగా అమల్లో ఉన్న 66:34 తాత్కాలిక పంపిణీ ఫార్ములాను 2027 జూలై వరకు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
తగ్గిన వర్షపాతం, పరిమిత నీటి ప్రవాహాల కారణంగా కృష్ణా బేసిన్‌లో కేవలం 100 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని అంచనా. ఈ నేపథ్యంలో మిగిలిన జలాలను ప్రధానంగా తాగునీటి అవసరాలకే వినియోగించాలని, కాలువల నుంచి అనధికార మళ్లింపును అరికట్టాలని ఏపీ కోరింది.
అయితే, ప్రస్తుత ఫార్ములాకు బదులు 50:50 వాటా కావాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. గత 12 ఏళ్లలో ఎనిమిది సార్లు మిగులు జలాలు లభించగా, నాలుగుసార్లు కొరత ఏర్పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఇరు రాష్ట్రాలు తమ వాటాలకే కట్టుబడి ఉండాలని, భవిష్యత్తులో ఈ అంశంపై శాశ్వత పరిష్కారం దిశగా చర్చలు జరపాలని నీటిపారుదల నిపుణులు సూచిస్తున్నారు.
