కొండపి (ఎక్స్‌ప్రెస్ టుడే): గర్భకండ్రిక భూముల సమస్య పరిష్కారంపై ప్రకాశం జిల్లా కొండపిలో 8 గ్రామాల రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించారు.

గర్భకండ్రిక భూ సమస్యల గురించి జిల్లా కలెక్టర్ రాజాబాబు ముఖ్యమంత్రికి వివరించారు. నర్సింగోలులో రైతుల కష్టాలను ముఖ్యమంత్రి స్వయంగా విన్నారు. 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా గర్భకండ్రిక భూములపై హక్కుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ నిర్ణయంతో ఊరట లభించింది.

గర్భకండ్రిక భూముల రైతులకు రైత్వారీ పట్టాలు జారీ అయ్యేలా సీఎం నిర్ణయించారు. ప్రకాశం జిల్లాలో 1,301 మంది రైతులకు ఇది ప్రయోజనం కల్పిస్తుంది. 4 మండలాల్లోని 8 గ్రామాల్లో 2,915.10 ఎకరాల భూములకు ముఖ్యమంత్రి పరిష్కార మార్గం చూపారు.

చారిత్రక రికార్డుల పరిశీలన

రైతుల భూ హక్కుల గుర్తింపునకు చారిత్రక రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. 1959 నాటి ఫారం-2 రికార్డుల ఆధారంగా భూముల వివరాలను సీఎం పరిశీలించారు. ఇనాం భూముల సమస్య పరిష్కారానికి చట్టబద్ధ ప్రక్రియ చేపడుతూ నిర్ణయం తీసుకున్నారు. సాగు చేస్తున్న రైతులు సమర్పించిన పత్రాలను ముఖ్యమంత్రి పరిశీలించారు.

వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో భూముల వివరాల సవరణకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. భూముల రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ రుణాలకు ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపడతారు. పంటల బీమా, సబ్సిడీలు, ప్రభుత్వ పథకాలు పొందేందుకు రైతులకు మార్గం సుగమం చేశారు.

గ్రామాల వారీగా పట్టాలు

నర్సింగోలు గ్రామంలోనే 209 మంది రైతులకు 400.24 ఎకరాల మేర పట్టాలు జారీ చేశారు. కొండపి మండలంలోని ఇలవర, వెన్నూరు గ్రామాల్లో 281 మంది రైతులకు 1,003 ఎకరాలకు హక్కులు కల్పించారు. జరుగుమిల్లి మండలంలోని పచ్చవ, వర్దినేనిపాలెం, నర్సింగోలు, కె. బిట్రగుంట గ్రామాల్లో 569 మందికి 1,260 ఎకరాల భూమికి పట్టాలు జారీ చేశారు.

నాగులుప్పలపాడు మండలం ఓబన్నపాలెంలో 430 మందికి 567 ఎకరాల మేర, సింగరాయకొండ మండలం కలికివాయలో 21 మందికి 62 ఎకరాల మేర పట్టాలు పంపిణీ చేశారు.

రైతులకు భూములపై హక్కులు కల్పించడంతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూరిందని ముఖ్యమంత్రి తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు పరిష్కారం చూపడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గర్భకండ్రిక భూములకు పట్టాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులు ధన్యవాదాలు తెలిపారు.