అమరావతి, సెప్టెంబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ అత్యంత ఉత్సాహంగా, జెట్ స్పీడ్‌తో ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

  • రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ కార్యకర్తలు ఇదే ఉత్సాహం ప్రదర్శించాలని పిలుపు
  • పంచాయతీ రాజ్ శాఖలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని ప్రశంస
  • రాష్ట్రవ్యాప్తంగా రూ.11 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు వెల్లడి

రాష్ట్ర క్యాడర్‌లో కనిపిస్తున్న జోష్‌ను బట్టి ఏపీలో ఎన్డీయే హవా రాబోయే కాలంలోనూ కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహిళలు సైతం పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారని పేర్కొన్నారు.

2024 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని శాఖల్లోనూ మార్పులు తెచ్చామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు అధ్వానంగా ఉండేవని, ఆ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన విమర్శించారు.

తన సుదీర్ఘ అనుభవం, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హుషారు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో చేపట్టిన ‘పల్లె పండుగ’ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిందని కొనియాడారు.

ప్రజలు ఎన్డీయే కూటమికి వేసిన ప్రతి ఓటూ వృథా కాలేదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, ప్రజా ప్రభుత్వం మరింత వేగంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని సీఎం పేర్కొన్నారు.