విశాఖపట్నం, సెప్టెంబర్ 24: బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర తీరానికి సమీపంగా కొనసాగిన తీవ్ర వాయుగుండం (డీప్ డిప్రెషన్) బుధవారం రాత్రి సుమారు 11 గంటలకు శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని తాకింది. తీరాన్ని పూర్తిగా దాటేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టినట్టు తెలుస్తోంది.
- కళింగపట్నం సమీపంలో బుధవారం రాత్రి తీరం దాటిన తీవ్ర వాయుగుండం
- గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
- ఐదు ఎస్డీఆర్ఎఫ్, నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు సిద్ధం
- తీరం దాటిన తర్వాత కూడా వర్షాలు కొనసాగుతాయని, మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురవవచ్చని అంచనా.
ముందస్తు చర్యల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో మూడు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు, విశాఖపట్నంలో రెండు, పోలవరం, అనకాపల్లి జిల్లాల్లో ఒక్కో బృందం చొప్పున సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్నాయి. ఆర్టీజీఎస్ ఆధారిత విపత్తు హెచ్చరిక వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయి అధికారులకు, ప్రజలకు హెచ్చరికలు పంపుతున్నట్టు ఆయన వెల్లడించారు. బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, హోర్డింగుల వద్ద నిలబడవద్దని ప్రజలకు సూచించారు.
ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. టెక్కలి మండలం పెద్దరోకళ్లపల్లిలో వాగు పొంగి రోడ్డుపైకి రావడంతో రాకపోకలు నిలిచిపోగా, సీతారాంపల్లి, రామనగరం గ్రామాలకు రవాణా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆమదాలవలసలో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి, పలుచోట్ల ఇళ్లలోకి వరద ప్రవేశించింది. పలాసలో బుధవారం ఉదయం వరకు 24 గంటల్లో 141 మి.మీ. వర్షపాతం నమోదైంది.
వర్ష సూచన నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తీరం వెంబడి గంటకు 55–75 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు శుక్రవారం వరకు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశించారు.
