విశాఖపట్నం, సెప్టెంబర్ 19: ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం విశాఖపట్నంలో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ఆయన సుమారు 26 వేల మంది అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలు, కన్వేయన్స్ డీడ్లు పంపిణీ చేస్తారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
నగర తాగునీటి సరఫరా వ్యవస్థను ఆధునీకరించేందుకు చేపట్టిన మొత్తం రూ.1,838 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టుల్లో నాలుగింటికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి, ఒక ప్రాజెక్టును ప్రారంభిస్తారని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. వీటిలో మధురవాడ, పరిసర ప్రాంతాల్లో రూ.725 కోట్లతో చేపట్టే 24 గంటల తాగునీటి సరఫరా వ్యవస్థకు శంకుస్థాపన కూడా ఉంది. ఈ ప్రాజెక్టులను యూసీఎఫ్, అమృత్ 2.0, పీపీపీ విధానాల్లో చేపడుతున్నారు.
సాయంత్రం ఆర్కే బీచ్లో జరిగే 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలతో ముఖ్యమంత్రి ముచ్చటిస్తారు. సముద్ర కాలుష్యాన్ని అరికట్టేందుకు ఉద్దేశించిన 'నిర్మల్–సాగర్' ప్రాజెక్టును కూడా ఆయన ప్రారంభిస్తారు. బీచ్ శుభ్రత, సముద్ర వ్యర్థాల రీసైక్లింగ్, తీరప్రాంతంలో జీవనోపాధి అవకాశాల కల్పనపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది.
జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్ తదితరులు పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు. భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్ వంటి ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది.
