ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) హైదరాబాద్‌లో నిర్వహించిన 'సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్ 2026'లో 'ట్రాన్స్‌ఫార్మింగ్ ఏఐ' అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) నమూనా ద్వారా రాష్ట్రంలో అనేక సంస్కరణలు అమలు చేసినట్టు ఆయన వివరించారు.

పీపీపీ నమూనాకు జగ్గురుపాడు విద్యుత్ ప్రాజెక్టును ఒక విజయవంతమైన ఉదాహరణగా సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. 30 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు తిరిగి ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చిందని, ఇది ఒక విజయవంతమైన నమూనా అని ఆయన అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పీపీపీ ప్రాజెక్టులు విజయం సాధించాయని, ఇవి సంపద సృష్టికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.

గిరిజన అభివృద్ధిపై మాట్లాడుతూ, గిరిజన రైతులు పండించే అరకు కాఫీని మార్కెటింగ్ చేసేందుకు తాను స్థాపించిన నంది ఫౌండేషన్‌ను సీఎం గుర్తుచేసుకున్నారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇప్పుడు ఈ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.

పేదల సంక్షేమ పథకాలపైనా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. సూపర్ సిక్స్ హామీలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్న క్యాంటీన్లు, రైతులకు ఆర్థిక సాయం వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో సమగ్రాభివృద్ధిని సాధిస్తున్నట్టు వివరించారు.

కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సేవలను ప్రభుత్వ పాలనలో మరింతగా వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, డేటా సెంటర్లు, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుతో కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు.