భీమునిపట్నం, అక్టోబర్ 1 (ఎక్స్‌ప్రెస్ టుడే): మహిళలు, బాలికల భద్రత, రక్షణ, సాధికారతకు మరింత భరోసా కల్పించే దిశగా భీమునిపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలో నూతన మిషన్ శక్తి-వన్‌స్టాప్ సెంటర్ (సఖి) భవన నిర్మాణానికి గురువారం భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా మంజూరైన 11 వన్‌స్టాప్ సెంటర్లలో భాగంగా, బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10 కేంద్రాలకు భూమిపూజ చేసిన కార్యక్రమానికి అనుసంధానంగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భీమిలిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి చేతుల మీదుగా భూమిపూజ, శంకుస్థాపన జరిగింది.
హింస, వేధింపులు, గృహహింస, లైంగిక వేధింపులు తదితర సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలు, బాలికలకు ఒకే వేదికపై తక్షణ సహాయ సేవలు అందించేందుకు వన్‌స్టాప్ సెంటర్ కీలకంగా ఉపయోగపడుతుందని జేసీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైద్య సహాయం, పోలీస్ భద్రత, ఉచిత న్యాయ సహాయం, మానసిక కౌన్సెలింగ్, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను సంబంధిత శాఖల సమన్వయంతో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళలు, బాలికలు 181 మహిళా హెల్ప్‌లైన్, 112 అత్యవసర సేవలతో పాటు వన్‌స్టాప్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సీహెచ్‌సీ ప్రాంగణంలో నూతన భవనం అందుబాటులోకి రావడం ద్వారా భీమిలి, పరిసర ప్రాంతాల మహిళలు, బాలికలకు రక్షణ, సహాయ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయని ఆమె పేర్కొన్నారు.
