బెంగళూరు, నవంబర్ 1 (ఎక్స్‌ప్రెస్ టుడే): రాప్తాడు అమానుష దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి, బెంగళూరు ఓల్డ్ హాల్ ఎయిర్ పోర్ట్ రోడ్డులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు.

బాలిక ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి లోకేష్, చికిత్సపై ఆసుపత్రి వైద్యులతో సుదీర్ఘంగా చర్చించారు. విద్యార్థినికి అవసరమైన శస్త్రచికిత్సలను ఇప్పటికే విజయవంతంగా పూర్తిచేశామని, బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వచ్చే 48 గంటల పాటు కీలకమని మంత్రి లోకేష్‌కు వివరించారు.

వచ్చే 48 గంటల పాటు బాలిక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తామని మంత్రి లోకేష్ అన్నారు. మా బిడ్డలా భావించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. బాలిక ప్రాణాలను కాపాడేందుకు మణిపాల్ ఆసుపత్రి వైద్యులు చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం ఆసుపత్రిలో బాలిక చికిత్స పొందుతున్న పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు వెళ్లిన మంత్రి లోకేష్, ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్న బాలికను చూశారు. మంత్రి లోకేష్‌తో పాటు ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజ, విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా ఉన్నారు.

అనంతరం బాలిక తల్లిదండ్రులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఘటన జరిగిన తీరును స్కూల్ ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం, తాను అన్ని విధాలా అండగా ఉంటామని బాలిక కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. బాలికపై రాక్షస దాడికి పాల్పడిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు.