అనకాపల్లి, అక్టోబర్ 17 (ఎక్స్‌ప్రెస్ టుడే): రాబోయే ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు తమ బాధ్యతలను అత్యంత అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ స్పష్టం చేశారు.

శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మున్సిపల్, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఆర్వోలు, ఏఈఆర్వోలు, జిల్లా అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్‌తో కలిసి కలెక్టర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి దశ పకడ్బందీగా జరగాలని ఆదేశించారు.

ప్రతి రిటర్నింగ్ అధికారి అధికారిక హ్యాండ్‌బుక్‌ను పూర్తిగా చదివి, అందులోని ప్రతి నిబంధనను, ఫార్మాట్‌ను అవగతం చేసుకోవాలని, ఎన్నికల వేళ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేకుండా హ్యాండ్‌బుక్‌లో అన్ని మార్గదర్శకాలు స్పష్టంగా ఉంటాయని చెప్పారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో అభ్యర్థుల నుంచి రశీదులు, చెక్‌లిస్టులు సక్రమంగా తీసుకోవాలని, ప్రతిరోజూ అందిన నామినేషన్లపై ప్రత్యేక నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. నిర్ణీత తేదీల్లో అభ్యర్థులు లేదా వారి అధికారిక ప్రతినిధుల సమక్షంలో నామినేషన్ల పరిశీలనను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.

నామినేషన్లను తిరస్కరించే సందర్భంలో ఆ నిర్ణయాలను వెంటనే రాతపూర్వకంగా సంబంధిత అభ్యర్థికి తెలియజేయాలని, అభ్యర్థుల అప్పీళ్లకు నిబంధనల ప్రకారం తగిన సమయం ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో చిన్న పొరపాటు కూడా అధికారి బాధ్యత కిందకే వస్తుంది కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ విధులను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద ఆర్వో హ్యాండ్‌బుక్‌లోని ప్రతి అంశంపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని, ఇందుకోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఉండాలని అన్నారు.

ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం, డబ్బు, మద్యం, ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపిణీ చేయడాన్ని నిషేధించాలని ఆదేశించారు. దసరా లేదా ఇతర పండుగల పేరుతో జరిగే ఆహార, వస్తువుల పంపిణీలను సరైన కారణం లేకుండా అనుమతించరాదని తెలిపారు. నగదు రూపంలో గరిష్ఠంగా రూ.50,000 వరకు మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతి ఉందని, బహుమతుల రూపంలో రూ.10,000 కంటే ఎక్కువ విలువైన బహుమతులు ఎవరూ ఎవరికీ ఇవ్వకూడదని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాలు, బలహీన వర్గాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను, అలాగే కొద్దిమంది ఆధిపత్య వర్గాలు ఓటు వేయకుండా అడ్డుకునే ప్రాంతాలను “సున్నితమైన క్లస్టర్లు”గా గుర్తించాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల్లో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఒక వీడియోగ్రాఫర్, ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారని తెలిపారు. బెదిరింపులు జరిగే ప్రాంతాలకు తక్షణమే వెళ్లి అడ్డుకోవాలని, బాధితులకు భరోసా కల్పించాలని, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ వాహనాలు, స్టేషనరీ తనిఖీలను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు.

పేపర్ బ్యాలెట్ విధానంలో ఒక ఓటరు ప్రక్రియను పూర్తి చేయడానికి సుమారు 45 సెకన్లు పడుతుందని, గంటకు 60 నుంచి 100 మంది ఓటర్లు సక్రమంగా ఓటు వేసేలా కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ ఉండాలని, ప్రతి గంటకూ నివేదికను పంపడంతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని చెప్పారు. రూట్, జోనల్ అధికారులు సమర్థవంతంగా వ్యవహరిస్తే రీ-పోలింగ్ జరిగే అవకాశం ఉండదని, ప్రిసైడింగ్ అధికారులు తమ విధులను స్పష్టంగా తెలుసుకొని నిర్వర్తించాలని, బ్యాలెట్ బాక్సులను భద్రపరచి కేంద్రానికి సురక్షితంగా అందజేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని ఆదేశించారు.

ఓట్ల లెక్కింపు కోసం తగినన్ని కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయాలని, రౌండ్ వారీగా ఫలితాలను త్వరగా వెల్లడించడం ద్వారా అభ్యర్థుల ఉత్కంఠను, ఉద్రిక్తతలను తగ్గించవచ్చని, బ్యాలెట్ బాక్సుల విభజన, లెక్కింపు ప్రక్రియను ఎటువంటి పొరపాట్లు లేకుండా నీట్‌గా పూర్తి చేయాలని చెప్పారు. బ్యాలెట్ బాక్సులు, స్టాట్యుటరీ, నాన్-స్టాట్యుటరీ పత్రాలను పద్ధతిగా సీల్ చేసి అందజేయాలని సూచించారు.