అనకాపల్లి, అక్టోబర్ 12 (ఎక్స్ప్రెస్ టుడే): పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి, అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్, డీఆర్వో వై. సత్యనారాయణ రావు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి తీసుకున్న అర్జీల గురించి సంబంధిత అధికారులను వెంటనే వివరాలు అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. అదేవిధంగా డివిజన్, మండల, గ్రామ, వార్డు స్థాయిలలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై, ఆయా స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారులు అందజేసిన దరఖాస్తుల పరిష్కారానికి వారితో నేరుగా మాట్లాడాలన్నారు.
పరిష్కారమయ్యే సమస్యలను పరిష్కరించి, పరిష్కారం కాని దరఖాస్తులకు గల కారణాలను వారికి వివరంగా తెలియజేయడం ద్వారా అర్జీలు రీ ఓపెన్ కాకుండా నివారించవచ్చని తెలిపారు. అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి శాఖ అధికారి తమ శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కార పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షించి, గడువులోపల చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.
