అనకాపల్లి, అక్టోబర్ 8 (ఎక్స్‌ప్రెస్ టుడే): జిల్లాలో స్థానిక సంస్థలు మరియు పురపాలక ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయని, నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిందని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.
గురువారం ఉదయం అమరావతిలోని ఏపీ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల జిల్లా అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ (ఐఏఎస్, రిటైర్డ్) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా సన్నద్ధతను కలెక్టర్ ఆయనకు వివరించారు.
అనకాపల్లి జిల్లా పరిధిలో రెండు మున్సిపాలిటీలతో పాటు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ జోన్ విస్తరించి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు వరకు ఉన్న అన్ని మార్గదర్శకాలను పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.
జిల్లా పంచాయతీ అధికారి నియామకానికి సంబంధించిన ఆర్డర్లు జారీ అయ్యాయని, సంబంధిత అధికారి త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని, ఎలాంటి సమస్యలు ఎదురైనా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి తక్షణ చర్యలు చేపడతామని తెలిపారు.
ఎన్నికల ప్రక్రియలో లేదా రిజర్వేషన్ల రూపకల్పనలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని 6,333 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి సాధారణ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను రేపటికల్లా సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
పోలీస్ సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా మాట్లాడుతూ, గత ఎన్నికల నాటి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయినందున ఎస్హెచ్ఓలతో కలిసి పోలింగ్ కేంద్రాలను పునఃపరిశీలించి సాధారణ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా వర్గీకరించాలని సూచించారు. పరిమితంగా ఉన్న పోలీసు బలగాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల్లో నేరుగా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానమయ్యేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ రోజున ఓటర్లు ఇబ్బంది పడకుండా తాగునీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని, సమన్వయంతో పనిచేసి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సందీప్, మున్సిపల్ కమిషనర్లు, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
