అనకాపల్లి, అక్టోబర్ 19 (ఎక్స్‌ప్రెస్ టుడే): జిల్లాలో జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అధికారులు తమ బాధ్యతలను అత్యంత అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఆర్వోలు, ఏఈఆర్వోలు, జిల్లా అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ రవీంద్ర ధామ, జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్‌లతో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ ఈ శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులపై ఎలాంటి ఆరోపణలు రాకుండా, తాము నిబంధనల ప్రకారమే పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని నిరూపించుకోవడానికి వీడియోగ్రఫీ రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ప్రతి అభ్యర్థికీ క్రమశిక్షణ, సమాన స్థాయి అవకాశం అందించడమే అధికారుల బాధ్యత అన్నారు.
అభ్యర్థులందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తించేలా చూడాలని, అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చును ఖర్చుల పరిశీలకులు నిశితంగా గమనించాలన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన పరిమితి లోపులోనే ఖర్చులు ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం నిబంధనల మేరకు పర్యవేక్షిస్తేనే అభ్యర్థుల్లో ఖర్చులపై ఆటోమేటిగ్గా సెల్ఫ్ కంట్రోల్ వస్తుందని తెలిపారు.
ఎన్నికల్లో పార్టీ పెట్టే ఖర్చులు వేరు, అభ్యర్థి పెట్టే ఖర్చులు వేరని, ప్రధాన ప్రకటనలు పార్టీ స్థాయిలో ఉంటాయని, అభ్యర్థులు తమ పరిధిలోని ఖర్చులను నిబంధనలకు లోబడి స్పష్టంగా చూపించాలని పేర్కొన్నారు. అధికారుల ఉనికి, ఎన్నికల పరిశీలకులు మరియు అధికారుల పర్యవేక్షణ ఉంటే అభ్యర్థుల్లో నియంత్రణ ఉంటుందని స్పష్టం చేశారు. అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై, నవంబర్ 3వ తేదీ వరకు జరిగే ఈ ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ తెలియజేశారు.
ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ రవీంద్ర ధామ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో నిర్వహించే వివిధ ఈవెంట్లకు సంబంధించిన వీడియోలను ముందుగానే రికార్డ్ చేసి ఉంచుకోవాలని, ఆ వీడియోల ద్వారా అభ్యర్థుల ఖర్చులకు సంబంధించిన అనేక వివరాలను గుర్తించవచ్చని తెలిపారు. ప్రచారాల వీడియోలు సభల్లో లేదా ర్యాలీలలో ఉపయోగిస్తున్న వస్తువులు మరియు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేలా ఉండాలని, అప్పుడే ఖర్చులను సరిగ్గా లెక్కించడానికి వీలవుతుందన్నారు.
ర్యాలీలలో పాల్గొనే వాహనాలకు సంబంధించి వ్యక్తిగత వాహనాలు, స్వచ్ఛందంగా పాల్గొనే వాహనాలను ఖర్చుల కింద లెక్కించాలా వద్దా అనే దానిపై స్పష్టత ఉండాలన్నారు. ఎలాంటి జెండాలు, అభ్యర్థుల ఫోటోలు లేకుండా స్వచ్ఛందంగా పాల్గొనే వాటిని మినహాయించవచ్చని, వ్యక్తిగత వాహనాలు వాడినప్పుడు డ్రైవర్ జీతం, డీజిల్ ఖర్చులను ఖర్చుల జాబితాలో చేర్చాల్సి ఉంటుందని చెప్పారు. గరిష్ట ఖచ్చితత్వంతో అన్ని ఖర్చులను అకౌంట్ చేయాలని సూచించారు. అభ్యర్థుల ఖర్చుల విషయంలో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌ల పర్యవేక్షణ ఎంతో ముఖ్యమన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణ రావు, వీఆర్వోలు, ఏఈఆర్వోలు, జిల్లా అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు పాల్గొన్నారు.
