అమరావతి, అక్టోబర్ 19 (ఎక్స్‌ప్రెస్ టుడే): అధర్మం ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం ధర్మానిదేనని, అహంకారం ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా ప్రజాశక్తి ముందు తలవంచక తప్పదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అసత్యంపై సత్యం, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నింపాలని ఆకాంక్షించారు. దుర్గామాత ఆశీస్సులతో అన్నదాతల ఇంట సిరులు పండాలని, పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పురాణాల్లో మహిషాసురుడి అహంకారాన్ని దుర్గాదేవి అంతం చేస్తే, ప్రజాస్వామ్యంలో రాజకీయ మహిషాసురుల అహంకారాన్ని ప్రజలే తమ ఓటుతో అణచివేస్తారని వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతమని, తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అని విర్రవీగిన వారికి ప్రజాతీర్పు ఇప్పటికే తగిన గుణపాఠం చెప్పిందన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాసే అహంకార రాజకీయాలకు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రతీకగా మారారని విమర్శించారు. కీచక మనస్తత్వంతో సాగించే రాజకీయాలకు, అరాచక పోకడలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదని స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మరింత విజ్ఞతతో వ్యవహరించాలని మంత్రి కోరారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే నాయకత్వానికి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు. వైసీపీ రాజకీయ అహంకారాన్ని, అధికార దుర్వినియోగాన్ని, అరాచక ధోరణులను ఓటు అనే ఆయుధంతో తిరస్కరించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించే రాజకీయ పోకడలకు ప్రజలు మరోసారి తగిన సమాధానం చెప్పాలన్నారు. విజయదశమి అంటే కేవలం పండుగ జరుపుకోవడం మాత్రమే కాదని, సమాజంలో పాతుకుపోయిన అహంకారం, అసత్యం, అన్యాయం, అధర్మాన్ని పారదోలాలనే సంకల్పానికి ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం వైపు ముందుకు సాగాలని, రైతులు, కార్మికులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.