అమరావతి, అక్టోబర్ 27 (ఎక్స్‌ప్రెస్ టుడే): గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ ఉడత బెదిరింపులకు భయపడేవారెవరూ లేరని.. ఇప్పుడు మీ టైం, తర్వాత మా టైం అంటూ వడ్డీతో చెల్లిస్తామని పోలీసులను హెచ్చరించడం మానుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. పగటి కలలు కనడానికి ఎవరి అనుమతీ అవసరం లేదు...
కానీ ఆ కలలతో అధికారులను భయపెట్టాలనుకోవడం మీ భ్రమ మాత్రమే. ప్రజాస్వామ్యంలో ఎవరి టైం నడవాలో నిర్ణయించేది ప్రజలే తప్ప మీ బెదిరింపులు కాదు అని మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆడలేక మద్దెల ఓడన్నట్లు గత ఐదేళ్ల పాలనలో జరిగిన తప్పులపై సమాధానం చెప్పకుండా పోలీసులపై ప్రతీకార హెచ్చరికలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
అధికార యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారనే విమర్శలు ఎదుర్కొన్న జగన్, ఇప్పుడు అదే అధికారులను బెదిరించడం విడ్డూరమన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన హింసను జగన్ మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. 2020లో నామినేషన్ల సందర్భంగా గుంటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు.
మాచర్లలో టీడీపీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. నామినేషన్ల సమయంలో హింసపై వచ్చిన ఫిర్యాదులతో గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల బదిలీలకు అప్పటి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవీకాలాన్ని తగ్గిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేసిన చరిత్ర ఎవరిదని ప్రశ్నించారు.
తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు నాడు జరిగినవన్నీ మర్చిపోయి ఇప్పుడు ప్రజాస్వామ్యంపై గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ ఉపన్యాసాలు ఇవ్వడం విడ్డూరమన్నారు.
సొంత పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి అనపర్తి మణికంఠపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై కేసు నమోదవడం వైసీపీలో కార్యకర్తలకు దక్కుతున్న గౌరవాన్ని ప్రశ్నిస్తోందన్నారు. క్షణికావేశంలో తొందరపడ్డానని స్వయంగా రాజా చెప్పిన తర్వాత కూడా జగన్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. పుంగనూరులో జరిగిన ఎన్నికల ఘర్షణల్లో కూటమి నాయకులు గాయపడిన విషయాన్ని గుర్తుచేశారు.
మిథున్ రెడ్డి సృష్టించిన హింసాకాండ, కారుతో కూటమి నాయకులను, కార్యకర్తలను గుద్దిన ఘటన జగన్‌కు కనపడటం లేదా అని ప్రశ్నించారు. మేనమామ అంటే తండ్రితో సమానం. అలాంటి స్థానంలో ఉన్న జగన్ తన మేనకోడలి వివాహ వేడుక వేదిక విషయంలో సొంత చెల్లి షర్మిలతో వివాదానికి దిగడం బాధాకరం అని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
భద్రతా కారణాలు ఉన్నాయని చెబుతున్న జగన్, కుటుంబ సభ్యుల మధ్య సమస్యను సామరస్యంగా ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ సహా ప్రతి పార్టీ అభ్యర్థి స్వేచ్ఛగా నామినేషన్ వేస్తున్నారని, ఎక్కడైనా ఆటంకాలు ఎదురైతే ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. జగన్ పాదయాత్రలు చేసిన..
పొర్లుదండాలు పెట్టినా ప్రజల విశ్వాసాన్ని పొందలేరని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
