అమరావతి, అక్టోబర్ 7 (ఎక్స్ప్రెస్ టుడే): 2026–27 ఎక్సైజ్ పాలసీ కింద రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం దుకాణాలకు గాను ఇప్పటికే 2,929 దుకాణాల లైసెన్సులు పునరుద్ధరించామని, మరో 517 దుకాణాలను అక్టోబర్ 8న లాటరీ ద్వారా కేటాయించనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. దీంతో మొత్తం 3,446 దుకాణాల పునరుద్ధరణ లేదా కేటాయింపు పూర్తవుతుందని, ఇది మొత్తం దుకాణాల్లో సుమారు 92 శాతం అని పేర్కొన్నారు.
2024–26 ఎక్సైజ్ లైసెన్స్ కాలం సెప్టెంబర్ 30తో ముగియడంతో, ప్రభుత్వం అక్టోబర్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2027 వరకు కొత్త ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం ఇప్పటికే ఉన్న మద్యం దుకాణాల లైసెన్సుల పునరుద్ధరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
మొత్తం నోటిఫై చేసిన దుకాణాల్లో 2,929 దుకాణాలు పునరుద్ధరించబడ్డాయి. ఇందులో గీత కులాలకు కేటాయించిన దుకాణాలు కూడా ఉన్నాయి. అక్టోబర్ 8న 517 దుకాణాల కేటాయింపు పూర్తయిన తర్వాత ఇంకా 290 దుకాణాలు మిగులుతాయని, వాటికి విడిగా నోటిఫికేషన్ జారీ చేసి కేటాయింపు ప్రక్రియ చేపడతామని శ్రీధర్ తెలిపారు.
మిగిలిన దుకాణాలతో పాటు గతంలో పనిచేయని దుకాణాలు కలిపి మొత్తం 807 దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించేందుకు నోటిఫై చేశారు. వీటిలో ఒక్కో దుకాణానికి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన 517 దుకాణాలను అక్టోబర్ 8న లాటరీ ద్వారా కేటాయించనున్నారు.
లాటరీ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం లాటరీ నిర్వహించేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చామకూరి శ్రీధర్ చెప్పారు.
