తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జనం రోడ్లపైకి రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి సూచన

ఎక్కడా ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశం

అమరావతి, నవంబర్ 3 (ఎక్స్‌ప్రెస్ టుడే): తెల్లవారుజామున 03:30 గంటలకు మురసు తుఫాన్ పరిస్థితిపై మరోసారి జిల్లా కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మురసు తుఫాన్ 01 గంటకు తీరాన్ని తాకిందని, ఉదయం 06:30 గంటలకు పూర్తిగా తీరాన్ని దాటుతుందని అధికారులు తెలిపారు.

ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద మురసు తుఫాన్ తీరాన్ని తాకినట్టు అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జనం రోడ్లపైకి రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, సబ్‌స్టేషన్ల పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం విద్యుత్ స్తంభాలు ఎక్కడా పడిపోలేదని, విద్యుత్ సరఫరాకు ఎక్కడా అంతరాయం లేదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

ఎక్కడా ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆస్తి నష్టాన్ని కూడా వీలైనంత మేరకు నివారించాలని ముఖ్యమంత్రి అన్నారు.

జిల్లా కలెక్టర్లు వివరించిన క్షేత్రస్థాయి పరిస్థితులు

జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, రెండుచోట్ల చెట్లు కూలిపోగా వెంటనే తొలగించామని బాపట్ల జిల్లా కలెక్టర్ తెలిపారు. రేపల్లె, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా కురుస్తోందని చెప్పారు.

నెల్లూరులో 7 చోట్ల చెట్లు కూలిపోయాయని, వెంటనే తొలగించామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు.

ఒంగోలు జిల్లాలో 5 ప్రాంతాల్లో చెట్లు పడిపోయినట్టు సమాచారం రాగానే చర్యలు చేపట్టామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు.

కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, నాగాయలంక వంటి ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా కురుస్తోందని కలెక్టర్ తెలిపారు.

గుంటూరు జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైందని, ఎక్కడా విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకోలేదని కలెక్టర్ చెప్పారు.

ఎన్టీఆర్ జిల్లా పరిధిలో వివిధ ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయని కలెక్టర్ లక్ష్మీషా చెప్పారు. బుడమేరు పరిధిలో పర్యటించామని, ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు. మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడతాయనే ముందు జాగ్రత్తలో భాగంగా కొన్ని కుటుంబాలను శిబిరాలకు తరలించామని వివరించారు.

తుఫాన్ సహాయక చర్యలు తీసుకుంటూనే స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌కు చర్యలు తీసుకున్నామని కలెక్టర్లు తెలిపారు.

రాత్రంతా సమీక్షలో ముఖ్యమంత్రి

గత రాత్రి 10:00 గంటలకు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాత్రి నుంచి ప్రతి గంటకూ అధికారుల నుంచి సీఎం చంద్రబాబు సమాచారం తీసుకుంటూనే ఉన్నారు.

సోమవారం నాడు అంతా ఆర్టీజీఎస్‌లోనే ఉండి మురసు తుఫాన్‌పై ముఖ్యమంత్రి సమీక్షించారు. అదే రోజు వివిధ శాఖల ఉన్నతాధికారులు మొదలుకుని క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ మూడు టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.