అమరావతి, అక్టోబర్ 31 (ఎక్స్‌ప్రెస్ టుడే): మురసు తుఫానుకు విద్యుత్ శాఖ సన్నద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. తుఫాను ప్రభావంతో ఎన్ని జిల్లాల్లో విద్యుత్ శాఖపై ప్రభావం ఉంటుందనే అంశంపై రివ్యూ నిర్వహించారు.

6 వేల నుంచి 8 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు దెబ్బతింటాయని, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న 48 గంటల్లో సరఫరా పునరుద్ధరణ లక్ష్యంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు.

అవసరమైన సిబ్బంది, సామగ్రిని ముందే తరలించాలని సూచించారు. అర్నబ్ తుఫాను సవాళ్లను దృష్టిలో పెట్టుకుని మరింత సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ, తమిళనాడు నుంచి అదనపు సిబ్బంది, యంత్రాలు, పరికరాలు తెప్పించాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే తెలంగాణ నుంచి 500 మంది సిబ్బంది వచ్చారని, తమిళనాడు నుంచి కూడా విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైన సిబ్బందిని, యంత్రాలను పంపేందుకు అంగీకరించారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.

రేపటి నుంచి తుఫాను ప్రభావం మొదలవుతుందని, ప్రతి 4–6 గంటలకు తుఫాను ప్రభావంపై బులెటిన్ విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. సమీక్షకు విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయానంద్, విద్యుత్ పంపిణీ వ్యవస్థల సీఎండీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.